- గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఏపీ తీరు
- పోలవరం– నల్లమల సాగర్‌పై సుప్రీంకోర్టులో
- తెలంగాణ వాదనలు
- వరదజలాలు తరలించవద్దని సీడబ్ల్యూసీ
- చెప్పినా ఏపీ పట్టించుకోవట్లేదని వాదన
- రిట్ పిటిషన్ కాదు.. సివిల్ సూట్ వేయాలన్న సీజేఐ
- సమస్య పరిష్కారానికి ఇప్పటికే కేంద్రం కమిటీ వేసింది కదా? అని ప్రశ్న
- అవసరమైతే ప్రాజెక్టుపై స్టే ఇచ్చేలా కమిటీకి ఆదేశాలిస్తమని వెల్లడి
- మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సూచన
హైదరాబాద్, వెలుగు:పోలవరం– బనకచర్ల పేరుతో ఏపీ వరద జలాలను తరలించుకుపోయే కుట్ర చేస్తున్నదని, అది గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధమని సుప్రీంకోర్టులో తెలంగాణ వాదించింది. ఎలాంటి అనుమతులు లేకుండానే ఏపీ ఈ ప్రాజెక్టును చేపడుతున్నదని, సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) ఆ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేదని పేర్కొంది. ప్రస్తుతం వేసిన పిటిషన్ జల వివాదంపై కాదని, ఉల్లంఘనలకు పాల్పడుతూ ప్రాజెక్ట్ విస్తరణను చేపడుతున్నదని అభ్యంతరం వ్యక్తం చేసింది.
సోమవారం ‘పోలవరం–బనకచర్ల/నల్లమలసాగర్’ ప్రాజెక్టును నిర్మించకుండా అడ్డుకోవాలని కోరుతూ తెలంగాణ వేసిన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణను ప్రారంభించింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చి ధర్మాసనం రెండు రాష్ట్రాల వాదనలను విన్నది. తెలంగాణ తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ, ఏపీ తరఫున ముకుల్ రోహత్గీ, జైదీప్ గుప్తా, బల్బీర్ సింగ్‌లు వాదనలు వినిపించారు.
ఏపీ అదనంగా 484 టీఎంసీల జలాలను తరలించేందుకు ఎత్తుగడ వేస్తున్నదని అభిషేక్ మను సింఘ్వీ చెప్పారు. ఈ వరద జలాలను తరలించడం వల్ల తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల్లో నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు ప్రాజెక్టులు రాష్ట్రంలో కడుతున్నామని, వాటికి కేటాయింపులు లేకుండా పోతాయని పేర్కొన్నారు. వరద జలాలను తరలించరాదని ఇప్పటికే సీడబ్ల్యూసీ స్పష్టం చేసిందన్నారు.
రెండు రాష్ట్రాల వాదనలు విన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్.. ఈ సమస్య పరిష్కారానికి ఇప్పటికే కమిటీ వేశారు కదా.. అక్కడే పరిష్కరించుకోవచ్చు కదా అని సూచించారు. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకునే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు.
రిట్ కాదు.. సూట్ వేయండి
ప్రస్తుతం ఈ పిటిషన్‌కు విచారణార్హత ఉందా లేదా అనేది ప్రశ్న అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని, అలాంటప్పుడు కేంద్రం అనుమతులు లేకుండా ఎలాంటి విస్తరణగానీ, నీటి మళ్లింపులుగానీ, ప్రాజెక్టుకు మార్పులుగానీ చేయలేరని స్పష్టం చేశారు. ‘‘పోలవరం కుడికాల్వను విస్తరించడం ద్వారా మీ వరద జలాలను నష్టపోతారనేది మీ (తెలంగాణ) అభ్యంతరం కదా. దీనిపై ఇప్పటికే కమిటీ వేశారు కదా.
ఆ కమిటీ ముందు మీ అభిప్రాయాలను వినిపించండి’’ అని తెలంగాణకు సీజేఐ సూచించారు. దీనికి స్పందించిన తెలంగాణ తరఫు అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ.. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును ఆపేందుకు సుప్రీంకోర్టులో కేసు వేయడం తప్ప మరో మార్గం తమకు లేదని చెప్పారు. ప్రాజెక్టుపై ముందుకు వెళ్లొద్దని చెప్పినా ఏపీ పట్టించుకోవట్లేదని, ఈ నేపథ్యంలోనే ఎమర్జెన్సీ సిచువేషన్ కింద సుప్రీంకోర్టును ఆశ్రయించామని ఆయన తెలిపారు.
పోలవరం ప్రాజెక్టును విస్తరించడం ద్వారా వరద జలాల పేరిట అదనంగా నీటిని తరలించుకునే ప్రయత్నం చేస్తున్నదన్నారు. గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఏపీ ముందుకెళ్తున్నదని ఆక్షేపించారు. అయితే, రెండు రాష్ట్రాల మధ్య గత జలవివాదాల పరిష్కారాలను ఆర్టికల్ 131 ప్రకారం సివిల్ సూట్ ద్వారా చేశారని, ఆర్టికల్ 32 ద్వారా రిట్ పిటిషన్లపై చేయలేదని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. సివిల్ సూట్ వేయాలని, అందులో కర్నాటకనూ భాగం చేయాలన్నారు. ఈ క్రమంలోనే సివిల్ సూట్ వేసేందుకు ఓ వారం టైం ఇవ్వాలని సీజేఐని సింఘ్వీ కోరారు.
ఆ రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకున్నాకే డీపీఆర్: ఏపీ
ఏపీ మాత్రం సుప్రీంకోర్టులో వితండవాదం చేసింది. మిగతా రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే డీపీఆర్ తయారీకి టెండర్లు పిలిచామని ఏపీ తరఫు అడ్వ కేట్ ముకుల్ రోహత్గీ కోర్టుకు తెలిపారు. మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ అభిప్రాయాలను తీసుకు న్నామని చెప్పారు. ఒక రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టును పొరుగు రాష్ట్రం అడ్డుకోలేదన్నారు.
ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారం పోలవరం ప్రధాన ప్రాజెక్టుకు తెలంగాణ ఆమోదం ఉన్నట్టే నని మరో సీనియర్ అడ్వకేట్ బల్బీర్ సింగ్ పేర్కొన్నారు. తెలంగాణ దురుద్దేశపూర్వకంగా ఈ పిటిషన్ దాఖలు చేసిందని అడ్వకేట్ జయదీప్ గుప్తా చెప్పారు. ప్రాజెక్టుపై స్టే ఇవ్వవద్దని ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపకుండా చూడాలన్నారు. పోలవరం ప్రాజెక్టును తెలంగాణ ఏర్పాటుకు ముందే చేపట్టారని గుర్తు చేశారు.
అవసరమైతే కమిటీని ఆదేశిస్తం..
పోలవరం నల్లమల సాగర్ కేసుకు సంబంధించి అవసరమైతే కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీకి ఆదేశాలిస్తామని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకుని మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకోవాలని కమిటీకి ఆర్డర్స్ ఇస్తామన్నారు. అయితే, ప్రాజెక్టును ఆపే అధికారం కమిటీకి ఇవ్వాలని సింఘ్వీ కోరగా.. అదే అయితే కమిటీకి అలాగే ఆదేశాలిస్తామని చెప్పారు.
ఈ క్రమంలోనే ప్రాజెక్టుపై కమిటీ అధికారాలేంటో తెలుసుకు నేందుకు, సూట్ ఫైల్ చేసేందుకు శుక్రవారం వరకు సమయం ఇవ్వాలని సింఘ్వీ కోరగా.. వీలైనంత వరకు సమస్యను ‘మధ్యవర్తిత్వం’ ద్వారా పరిష్కరించుకునే అంశాన్ని పరిశీలించాలని సీజేఐ సూచించారు. రెండు రాష్ట్రాల వాదనలు వింటామని, ఓ పరిష్కారంతో రావాలని ఆయన సూచించారు. కేసు విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
