ముగ్గురు ఎంపీల రాజీనామా

ముగ్గురు ఎంపీల రాజీనామా
  •  శాసన సభకు ఎన్నికైనందునే..

  •  ఉప ఎన్నికకు ఆస్కారం లేకపోవచ్చు

  •  పోటీ చేసింది ఏడుగురు.. గెలిచింది నలుగురు

  •  మూడు చోట్ల ఓటమి పాలైన బీజేపీ ఎంపీలు

హైదరాబాద్: శాసన సభ్యులుగా ఎన్నికైన ముగ్గురు ఎంపీలు రాజీనామా చేశారు. ఈ సారి  రాష్ట్రంలో ఏడుగురు ఎంపీలు...  ఎమ్మెల్యే స్థానాలకు  పోటీ చేశారు. వారిలో ముగ్గురు  గెలుపొందగా.. బీజేపీ నుంచి బరిలోకి దిగిన బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయంబాపురావ్ ఓటమి పాలయ్యారు. మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కొండగల్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రేపు  ( డిసెంబర్​ 7) ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి ఇవాళ ( డిసెంబర్​6) ఎంపీ పదవికి రాజీనామా చేశారు.  నల్లగొండ నుంచి ఎంపీగా కొనసాగుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన నిన్ననే ( డిసెంబర్​ 5)  తన ఎంపీ పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.  భువనగిరి ఎంపీగా కొనసాగుతున్న మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన కూడా రాజీనామా చేయనున్నారు. 

ఉప ఎన్నిక ఉండదు?

సాధారణంగా ఒక పార్లమెంటు సభ్యుడు కానీ, శాసన సభ్యుడు కానీ రాజీనామా చేస్తే కనీసం ఆరు నెలల పదవీకాలం మిగిలిపోయి ఉండాలి.  కానీ ఈ నలుగురు ఎంపీల పదవీకాలం ఏప్రిల్,2024తో ముగియనుంది. అంటే దాదాపు నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదు. అప్పటి వరకు ఈ నాలుగు పార్లమెంటు స్థానాలు ఖాళీగానే ఉంటాయి. తర్వాత లోక్ సభ ఎన్నికలు జరుగుతాయని తెలుస్తోంది