హైదరాబాద్ : జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం (ఏప్రిల్ 24) సందర్భంగా ఏటా గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చే అవార్డుల ఎంపిక కోసం ఈ ఏడాది నుంచి కొత్త పద్ధతిని అమలు చేయనున్నారు. గతేడాదిదాకా రాష్ట్ర ప్రభుత్వం పలు గ్రామ పంచాయతీ పేర్లను అవార్డుల కోసం కేంద్ర పంచాయతీ రాజ్ శాఖకు పంపిస్తూ ఉండేది. ఈ ఏడాది నుంచి ఆన్ లైన్ లో అవార్డుల కేటగిరీలకు సంబంధించిన ప్రశ్నలకు ఆన్సర్లను గ్రామ పంచాయతీ సెక్రటరీల నుంచి సేకరిస్తోంది. ఆ ఆన్సర్ల ప్రకారం ఆన్ లైన్ లోనే ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డుల ఎంపికను నిర్వహించనున్నారు. ఆన్ లైన్ లో అవార్డుల క్వశ్చనీర్ కు సంబంధించి ఇటీవల కేంద్ర బృందం వచ్చి రాష్ట్ర పీఆర్ అండ్ ఆర్డీ అధికారులకు, డీపీవోలకు ట్రైనింగ్ కూడా ఇచ్చింది.
9 కేటగిరీల్లో అవార్డులు
కేంద్రం ఏటా 9 కేటగిరీల్లో గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇస్తోంది. పేదరికం, జీవనోపాధి, హెల్త్, చైల్డ్ అండ్ విమెన్ ఫ్రెండ్లీ, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, గ్రీనరీ, స్వయం సమృద్ధి, సోషల్ సెక్యూరిటీ వంటి అంశాలలో పంచాయతీల పనితీరును అంచనా వేసి అవార్డులు అందచేస్తున్నారు. పనితీరు అంచనాకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఈ 9 అంశాలకు సంబంధించి 113 ప్రశ్నలతో క్వశ్చనీర్ ను తయారు చేసి ‘నేషనల్ పంచాయతీ అవార్డ్స్-2022 ’ వెబ్ సైట్ లో ఉంచింది. ఇందులో అన్ని ప్రశ్న లకు జీపీల సెక్రటరీలు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు కేంద్రం ఈ నెల 31 వరకు గడువు ఇచ్చింది.
ఇవీ ప్రశ్నలు
గ్రామాల్లో మహిళా సంఘాల సమావేశాల నిర్వహణ, కమ్యూనిటీ భవనం, గ్రంథాలయ భవనం, కరెంట్, కంప్యూటర్ సౌలతులు, క్రీడా ప్రాంగణాలు, వికలాంగులు, వృద్ధులు ఎంతమంది? కేంద్ర ప్రభుత్వ పింఛన్లు పొందుతున్న వారెంత మంది? వికలాంగులకు పరికరాలు అందాయా? కంప్యూటర్ ద్వారా సేవలు, తడి, పొడి చెత్త విభజన, వ్యర్థాలతో ఎరువు తయారీ, మరుగుదొడ్లు, మురుగునీటి వ్యవస్థ ఎలా ఉంది?, చిన్నారులకు పోషకాహారం అందుతోందా? వంటి ప్రశ్నలు ఉన్నాయి.
తనిఖీలు చేయనున్న కేంద్ర బృందాలు
పంచాయతీ సెక్రటరీలు సమాధానాలను గ్రామ పంచాయతీ లాగిన్ ఐడీ ద్వారా నమోదు చేస్తున్నారు. ఆ వివరాల నమోదు ముగియగానే రాష్ట్ర ప్రభుత్వ బృందం, ఆపై కేంద్ర బృందం పంచాయతీల్లో పర్యటించి వారు వెబ్ సైట్ లో ఇచ్చిన ఆన్సర్లు, వాస్తవ పరిస్థితిని బేరీజు వేయనున్నారు.
భారీగా క్యాష్ ప్రైజ్లు
9 విభాగాల్లో మెరుగైన పనితీరు ఉన్న గ్రామ పంచాయతీతో పాటు ఒక్కో విభాగం నుంచి ఒక్కో గ్రామ పంచాయతీని ఎంపిక చేసి అవార్డులు ఇవ్వనున్నారు. ఎన్డీఎస్పీఎస్వీపీ, డీడీయూపీఎస్వీపీ పేరిట 2 రకాల పురస్కారాలు ఇవ్వనున్నారు. ఎన్డీఎస్పీఎస్వీపీ కింద జాతీయ స్థాయి పురస్కారాలకు ఫస్ట్ ప్రైజ్రూ.1.50 కోట్లు, రెండో బహుమతి రూ.1.25 కోట్లు, మూడోది రూ. కోటి ఇవ్వనున్నారు. జిల్లా యూనిట్ పురస్కారాలకు వరుసగా రూ. 5 కోట్లు, రూ.3 కోట్లు, రూ.2 కోట్లు ప్రకటించారు. మండల యూనిట్ పురస్కారాలకు రూ. కోటి, రెండో బహుమతి రూ.75 లక్షలు, మూడో బహు మతి రూ.50 లక్షలు ఇవ్వనున్నారు. డీడీయూపీఎస్వీపీ కింద జాతీయ స్థాయి మొదటి ప్రైజ్ రూ. 50 లక్షలు, రెండో ప్రైజ్ రూ.10 లక్షలు, జిల్లా యూనిట్ పురస్కారాలకు మొదటి బహుమతి రూ. 1.50 కోట్లు, రెండో బహుమతి రూ.1.25 కోట్లు, మూడోది రూ. కోటి, మండలానికి ఫస్ట్ ప్రైజ్ రూ.50 లక్షలు, రెండోది రూ.40 లక్షలు, మూడో బహుమతి రూ.30 లక్షలు అందచేయనున్నారు.
మంత్రుల రెకమండేషన్లకు చెక్
రాష్ట్రంలో 8 ఏండ్లుగా పలువురు మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గాల్లోని గ్రామాలకు అవార్డులు ఇవ్వాలంటూ రాష్ట్ర పీఆర్ అండ్ ఆర్డీకి రికమండేషన్ లెటర్లు పంపేవారు. అందులోంచి పలు పేర్లను సిఫార్సు చేస్తూ పీఆర్ అధికారులు కేంద్రానికి లేఖలు పంపేవారని అధికారులు చెబుతున్నారు. రెకమండేషన్ల కారణంగా అవార్డుల లిస్ట్ లో ఎక్కువ శాతం మంత్రుల నియోజకవర్గాలకు చెందిన గ్రామ పంచాయతీలే ఉండేవి. గత ఏడాది కూడా కేంద్రం ఇచ్చిన అవార్డులలో ఎక్కువ శాతం ఐదుగురు మంత్రుల నియోజకవర్గాలకు చెందిన గ్రామాలే ఉన్నాయి. దీంతో రికమండేషన్ల పద్ధతికి చెక్ పెట్టేందుకు కేంద్రం ఆన్లైన్ నిర్ణయం తీసుకుంది.
