
ఆదిలాబాద్ జడ్పీతో సహా 2 మండల పరిషత్ లు
5 గ్రామ పంచాయతీలకు పురస్కారాలు
జడ్పీకి రూ. 50 లక్షలు, మండల పరిషత్ లకు రూ. 25 లక్షలు
గ్రామపంచాయతీలకు రూ. 8-12 లక్షల నగదు ఇవ్వనున్న కేంద్రం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్థానిక సంస్థలకు 2017-–18 ఏడాదికి కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ అవార్డులను ప్రకటించింది. పారిశుధ్యం, ఉత్తమ గ్రామ సభ వంటి అంశాలలో రాష్ట్రానికి మొత్తం 8 అవార్డులు దక్కాయి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్ పురస్కార్ (డీడీయుపీఎస్పీ), నానాజీ దేశ్ ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామ సభ పురస్కార్ ( ఎన్డీఆర్ జీజీఎస్పీ), గ్రామ పంచాయతీ డెవలప్ మెంట్ ప్లాన్ (జీపీడీపీ) కింద ఈ అవార్డులు దక్కాయి.
జిల్లా పరిషత్ కేటగిరీలో ఆదిలాబాద్ జడ్పీకి, మండల పరిషత్ విభాగంలో మంథని, వెల్గటూర్ లకు, గ్రామ పంచాయతీ విభాగంలో మల్కాపూర్(తుఫ్రాన్ మండలం, మెదక్ జిల్లా– పారిశుధ్యం), ఇరిక్కోడ్( సిద్దిపేట మండలం, జిల్లా– సోషల్ సెక్టార్ డెవలప్ మెంట్), మల్లారం ( మంథని మండలం, పెద్ద పల్లి జిల్లా–- పారిశుధ్యం) , నాగపూర్ (కమ్మర్ పల్లి మండలం, నిజామాద్– పారిశుధ్యం), రాఘవపూర్ (పెద్దపల్లి మండలం, జిల్లా – ఎన్డీఆర్ జీజీఎస్ పీ కింద ఉత్తమ గ్రామసభ)లకు అవార్డులు వచ్చాయి. జడ్పీకి రూ.50 లక్షలు, మండల పరిషత్ లకు రూ.25 లక్షలు, గ్రామ పంచాయతీలకు జనాభా ప్రకారం రూ.8 లక్షల నుంచి రూ.12లక్షల వరకు క్యాష్ ప్రైజ్ ను అవార్డుతో పాటు కేంద్రం త్వరలో అందచేయనుంది. అవార్డులను ఈ ఏడాది ఏప్రిల్24న పంచాయతీరాజ్ దినోత్సవం రోజునే ఇవ్వాల్సి ఉండగా, లోక్ సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వాయిదా వేశారు. కాగా, ఆదిలాబాద్ జడ్పీకి, ఇరిక్కోడ్ గ్రామ పంచాయతీకి 2016––17లోనూ అవార్డులు దక్కినట్లు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు వెల్లడించారు.