ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఢిల్లీలో సభ జరిపి తీరుతం :మహేశ్ కుమార్ గౌడ్

ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఢిల్లీలో సభ జరిపి తీరుతం :మహేశ్ కుమార్ గౌడ్
  •     అమిత్ షా పర్యటనతో తెలంగాణకు ఫాయిదా లేదు
  •     రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడమే లక్ష్యం
  •     రెండు ఎమ్మెల్సీ సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంటుంది
  •     విపత్తులు వచ్చినప్పుడు రాజకీయాలు చేయడమేంటి
  •     బీఆర్ఎస్ నేతల తీరుపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఫైర్ 


హైదరాబాద్, వెలుగు: బీజేపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా నవంబర్ 1న ఢిల్లీ రాంలీలా మైదానంలో కాంగ్రెస్ నిరసన సభను జరిపి తీరుతామని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. రాష్ట్రం నుంచి వేలాది మంది పార్టీ కార్యకర్తలు, ప్రజలు సభకు తరలివెళ్తారని, తెలంగాణ గళాన్ని అక్కడ బలంగా వినిపిస్తామని చెప్పారు. గురువారం గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్ఐఆర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ)కు వ్యతిరేకంగా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండియా కూటమి చేపడుతున్న ఈ నిరసనలో లక్షలాది మంది పాల్గొంటారని, దీంతో బీజేపీలో వణుకు మొదలైందన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనలతోనే రైల్వే అధికారులు స్పెషల్ రైళ్లు ఇవ్వకుండా కాలయాపన చేసి, చివరి నిమిషంలో కుంటిసాకులు చెప్పారని ఆరోపించారు. అమిత్ షా హైదరాబాద్ పర్యటనతో తెలంగాణకు ఒరిగేదేమీ లేదని మహేశ్ గౌడ్ అన్నారు. ఆయన ఇప్పటికే చాలాసార్లు ఇక్కడికి వచ్చారని, రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం పక్కా అని మహేశ్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.

టీచర్లు, గ్రాడ్యుయేట్ల ఎన్నికల్లో మేధావులు, యువత బీజేపీకి వ్యతిరేకంగా తీర్పిచ్చారని, మోదీ పాలనపై దేశంలో ఉన్న వ్యతిరేకతకు ఇదే నిదర్శనమన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఏ స్థాయిలో ఉంటుందో ఈ ఫలితాలు ముందే చెబుతున్నాయన్నారు. ఎన్ని సీట్లు గెలిచామన్నది కాదు, ఎక్కడ గెలిచామన్నదే ముఖ్యమని, బీజేపీ అగ్రనేతల కంచుకోటల్లోనే తాము బుల్లెట్ దించామని చెప్పారు. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నియోజకవర్గంలో, ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ ఉన్న నాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్ నియోజకవర్గం లక్నోలో బీజేపీ ఎందుకు ఓడిపోయిందో మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గం గోరఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు బీజేపీ స్వల్ప మెజార్టీతో బయటపడిందన్నారు. ఖర్గే చెప్పినట్లు సంఘ్ కంచుకోటలోనే కాంగ్రెస్ గెలిచిందన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ పని అయిపోయిందన్నట్లు మోదీ ట్వీట్ చేశారని, ఆ లెక్కన యూపీ, మహారాష్ట్రలో బీజేపీ పని కూడా అయిపోయినట్లేనని అన్నారు. మోదీ ట్వీట్లకే పరిమితమని, ప్రధాని అయి 12 ఏండ్లయినా ఒక్క ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీట్ కూడా పెట్టలేదని, ఆయనకు మీడియా ఫోబియా ఉందని విమర్శించారు. జర్నలిస్టుల ప్రశ్నలకు జవాబు చెప్పలేని పిరికి ప్రధాని అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్సే గెలుచుకుంటుందని మహేశ్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయన్నారు.

విపత్తుల వేళ రాజకీయమేంది?

విపత్తులు వచ్చినప్పుడు రాజకీయాలు చేయడం తగదని బీఆర్ఎస్ నేతలపై మహేశ్ గౌడ్ ఫైర్ అయ్యారు. రాజకీయం చేసే చోట చేయాలి కానీ ఇలాంటి సమయాల్లో కాదన్నారు. ప్రతిపక్ష నేతలుగా కేటీఆర్, హరీశ్ రావు విపత్తుల సమయంలో ప్రభుత్వానికి సహకరించాలే తప్ప ప్రతిదాన్నీ రాజకీయం చేయొద్దని హితవు పలికారు. ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినోపై హరీశ్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని, బటన్ నొక్కితే ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో వస్తుందని ఆయన అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆయన మాటలు విని జనం నవ్వుకుంటున్నారన్నారు. ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినోపై తప్పుడు ప్రచారం చేస్తే తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.  తుమ్మిడిహట్టి దగ్గర గ్రావిటీ ద్వారా నీళ్లు తరలించడానికి ఒప్పుకుని ఉంటే ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు ఉండేవి కావన్నారు. గ్రావిటీ అంశంపై హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జీరో నాలెడ్జ్ అని విమర్శించారు. అసలు నిధుల కొరతకు గత బీఆర్ఎస్ సర్కారే కారణమన్నారు. గాంధీ భవన్​లో జరిగిన సమావేశంలో పలువురు కాంగ్రెస్​ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు, ఇన్​చార్జిలు, తదితరులు పాల్గొన్నారు. 

అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలను.. క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలను పార్టీ క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుందని మహేశ్ గౌడ్ చెప్పారు. మాజీ మంత్రి కొండా సురేఖ తమ పార్టీ ఎమ్మెల్యే అని, ప్రత్యేక పరిస్థితుల్లో ఆమె మంత్రి పదవి కోల్పోయారని అన్నారు. కేటీఆర్ విషయంలో ఆమె స్పందించిన తీరును రాజకీయ కోణంలో చూడొద్దన్నారు. ఎవరైనా నోరుజారినప్పుడు సరిదిద్దుకోవడం సహజమని, తప్పు ఒప్పుకోవడాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదన్నారు. ఆమెకు బాసటగా నిలుస్తామని స్పష్టం చేశారు.