గ్రామాల్లో సమస్యలపై ఎమ్మెల్యేలను నిలదీస్తున్న జనాలు

గ్రామాల్లో సమస్యలపై ఎమ్మెల్యేలను నిలదీస్తున్న జనాలు
  • గ్రామాల్లో సమస్యలపై నిలదీస్తున్న జనాలు
  • పెండింగ్ పనులు, స్కీములపై ప్రశ్నిస్తున్న పబ్లిక్
  • దళితబంధు, డబుల్ బెడ్ రూం ఇండ్లపై నిలదీతలు
  • ల్యాండ్ పూలింగ్ పై ఓరుగల్లు లీడర్లకు చుక్కలు
  • మెట్ పల్లిలో కేటీఆర్ కాన్వాయ్ పై చెప్పులేసిన రైతు
  • ఇటీవల పెరుగుతున్న ఘటనలు

 వరంగల్‍, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పర్యటనలకు వెళ్తున్న మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలను గ్రామాల్లో జనం నిలదీస్తున్నారు. గ్రామాభివృద్ధికి గతంలో ఇచ్చిన హామీలను, పెండింగ్‍ పనులను గుర్తు చేస్తున్నారు. ‘డబుల్‍ బెడ్‍రూం ఇండ్లు ఇంకెప్పుడొస్తయ్‍’ అంటూ పేదలు అడుగుతున్నారు.  దళితబంధుపై పేద దళితులు ప్రజాప్రతినిధులను నిలదీస్తే.. పెండింగ్‍ బిల్లులపై సర్పంచులు ఎమ్మెల్యేలు, మంత్రులకు నిరసన తెలుపుతున్నారు.  ఓచోట ఎమ్మెల్యే ఊళ్లోకి రాకుండా ముళ్ల కంపలు అడ్డుగా వేస్తే..  మరోచోట ఎమ్మెల్యే వాహనానికి అడ్డుగా దుంగలు వేశారు. మరోచోట ఏకంగా కేటీఆర్‍ కాన్వాయ్​పై చెప్పులు విసిరారు.  గతంలో ఒకరిద్దరికి మాత్రమే పరిమితమైన నిరసన సెగ.. ఇప్పుడు అన్ని నియోజకవర్గాలకూ పాకడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు.

ఓరుగల్లు ఎమ్మెల్యేల మెడలు వంచిన రైతులు.. 
వరంగల్​ రింగ్​ రోడ్డు చుట్టూ డెవలప్‍మెంట్‍ పేరుతో ల్యాండ్​పూలింగ్​ కింద 22వేల ఎకరాల భూసేకరణ చేయాలని సర్కారు ఏకపక్షంగా నిర్ణయించింది. 27 గ్రామపంచాయతీల పరిధిలోని 40 కి పైగా గ్రామాల్లో రైతుల పర్మిషన్​ లేకుండా వారి భూములను తీసుకునేందుకు సర్వే ప్రారంభించడంతో వేలాది రైతులు భగ్గుమన్నారు.  ఆయా గ్రామాల్లోకి వచ్చిన ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్‍, తాటికొండ రాజయ్యను నిలదీశారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్‍, హెల్త్  మినిస్టర్​ హరీశ్​రావు వరంగల్​ జిల్లా పర్యటనల్లోనూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.  ఎమ్మెల్యే అరూరి రమేశ్‍ వాహనాన్ని ఐనవోలు మండలం పెరుమాండ్లగూడెంలో అడ్డుకొని నిరసన తెలిపారు.  

దళితబంధుపై ఎమ్మెల్యే శంకర్‍ నాయక్‍ నిలదీత
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లిలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను గ్రామస్థులు నిలదీశారు. అక్కడ ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రారంభించే క్రమంలో గ్రామస్థులు క్రీడా మైదానానికి తమ భూములియ్యమని తేల్చి చెప్పారు. తమ గ్రామానికి దళితబంధు ఎట్లుంటదో తెల్వదని.. లిస్టులో ఎవ్వరి పేర్లున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. 

వైశ్య కార్పొరేషన్ ప్రకటనపై మంత్రులకు నిరసన
లక్డీకపూల్​లోని వాసవి సేవా జరిగిన ఓ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, సోషల్ వెల్ఫేర్ మంత్రి కొప్పుల ఈశ్వర్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ దయానంద గుప్తా హాజరయ్యారు. మంత్రులు మాట్లాడుతుండగా తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ సాధన సమితి నాయకులు అడ్డుకున్నారు. ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుపై సీఎం కేసీఆర్‍ఇచ్చిన మాట ఇప్పటికీ అమలు కాలేదంటూ నినాదాలు చేశారు. 

బెల్లంపల్లిలో ఎమ్మెల్యే చిన్నయ్యకు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చాకెపల్లిలో క్రీడా ప్రాంగణం ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను స్థానిక సమస్యలపై గ్రామస్థులు నిలదీశారు. గ్రామం నుంచి క్వార్టర్స్ కాలనీ వరకు రోడ్డు వేయించాలని, క్రీడా ప్రాంగణంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో గ్రామస్థుడికి, ఎమ్మెల్యేకు వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే 'వేసేయండిరా..' అంటూ మాట్లాడడంపై గ్రామస్థులు మండిపడ్డారు. వీడియో చిత్రీకరించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు, టీఆర్ఎస్ నాయకులు లాక్కెళ్లారని ఆరోపించారు. 

మంత్రి నిరంజన్‍రెడ్డిపై.. రైతుల ఫైర్‍
నిజామాబాద్​ జిల్లా మామిడిపల్లిలో జరిగిన రైతు అవగాహన సదస్సులో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి మాట్లాడుతుండగా నిజాం షుగర్స్​ ఫ్యాక్టరీలను రీ ఓపెన్​ చేయాలని రైతులు డిమాండ్​ చేశారు. త్వరలోనే నిజాం షుగర్స్​ సమస్యను పరిష్కరిస్తుందని మంత్రి చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.

ఎమ్మెల్యే గండ్ర దంపతులపై  సీరియస్‍
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లిలో నాలుగు రోజుల కింద నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్‌ ‌రూరల్​ జడ్పీ చైర్​పర్సన్​ గండ్ర జ్యోతి హాజరయ్యారు. దీంతో డబుల్‌‌ బెడ్‌‌రూం ఇండ్లు.. కొత్త ఆసరా ఫించన్లు.. మిషన్‌ ‌భగీరథ నీళ్లు  ఎందుకు ఇవ్వడం లేదని గ్రామస్థులు నిలదీశారు. గండ్ర దంపతులు చేసేదేమీలేక.. అన్నింటికీ ఆఫీసర్లే కారణమన్నట్లుగా వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసి తిరుగుముఖం పట్టారు.

డోర్నకల్​ ఎమ్మెల్యే గో బ్యాక్​..
నర్సింహులపేట : నర్సింహులపేట మండలం జయపురంలో మహబూబాబాద్ జిల్లా  డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్  గో బ్యాక్​ అంటూ పబ్లిక్​ నినదించారు. డబుల్​బెడ్​రూం ఇండ్లు ఇచ్చాకే ఊళ్లో అడుగు పెట్టాలని డిమాండ్​చేశారు. ఆరేండ్ల క్రితం నిర్మించిన 50 డబుల్ బెడ్రూం ఇండ్లను ఇప్పటికీ పంచుకుండా కొత్తగా 25 ఇండ్లకు ఎలా శంకుస్థాపన చేస్తారని ఫైర్​ అయ్యారు. పోలీసులు గ్రామస్థులను పక్కకు తోసేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో  ఎమ్మెల్యే, పోలీసులకు వ్యతిరేకంగా గ్రామస్థులు నినదించారు. ఇవేవీ పట్టించుకోని ఎమ్మెల్యే అటు ఆందోళన జరుగుతుండగానే, ఇటు శంకుస్థాపన చేసి అక్కడి నుంచి హెల్త్​ సబ్​సెంటర్​ ఓపెనింగ్​కు వెళ్లిపోయారు. 

కేటీఆర్‍ కాన్వాయ్‍పై చెప్పులేసిన రైతులు
రాష్ట్ర మున్సిపల్​ శాఖ మంత్రి కేటీఆర్​ కాన్వాయ్​పై జగిత్యాల జిల్లా మెట్‍పల్లిలో గత శుక్రవారం రైతులు చెప్పులు విసిరారు. నిజాం ఫ్యాక్టరీపై స్పష్టమైన ప్రకటన చేశాకే మెట్‍పల్లిలో అడుగు పెట్టాలంటూ అంతకుముందు రోజే చెరుకు ఉత్పత్తిదారుల సంఘం, రైతు జేఏసీ నేతలు ప్రకటించారు. దీంతో పోలీసులు సంఘం నేతలను అరెస్ట్​ చేసి స్టేషన్​కు తరలించారు. శుక్రవారం కేటీఆర్​ కాన్వాయ్​ ఇదే పీఎస్​ ముందు నుంచి వెళ్లే క్రమంలో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి మంత్రికి నిరసన తెలిపేందుకు రోడ్డుమీదకు పరుగెత్తాడు. గేటు వద్ద కానిస్టేబుల్స్​ అడ్డుకోవడంతో కాన్వాయ్‍పై  చెప్పులు విసిరి నిరసన తెలిపాడు. దీంతో నారాయణరెడ్డితో పాటు మరో రైతు సంఘం నాయకుడు ప్రవీణ్‍పై కేసు నమోదు చేశారు. 

కొత్తగూడెం ఎమ్మెల్యేను చుట్టుముట్టి..
భద్రాద్రికొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురంలో మంగళవారం నిర్వహించిన పల్లె ప్రగతి ప్రోగ్రాంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వేంకటేశ్వర్​రావు ముందు గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. అంబసత్రం భూములకు పట్టాలివ్వాలని, తాము గ్రామంలో నిర్మించుకున్న ఇండ్లకు నంబర్లతో పాటు కరెంట్​మీటర్లు వచ్చేలా చూడాలని ఎమ్మెల్యేను కోరారు. దీంతో  ఆయన అసహనం వ్యక్తం చేశారు. సమస్యలు చెప్పిన వారిని ‘ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అని కోపగించుకోవడంతో గ్రామస్థులు కింద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను చుట్టుముట్టి సమస్యలను చెప్పడమే తమ తప్పా అని ప్రశ్నించారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో వారితో వాగ్వాదం జరిగింది. తర్వాత చల్లబడ్డ ఎమ్మెల్యే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది.