కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని అంతగా పెంచుతారా ?

కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని అంతగా పెంచుతారా ?

తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఇప్పుడు ఆ దిశగానే  పవనాలు వీస్తున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల  ఫలితాలే అందుకు నిదర్శనమని గుర్తు చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు  కేసీఆర్ శాయశక్తులను ఒడ్డినా.. బీజేపీ విజయశంఖం పూరించిందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లోనూ అదే తరహా విజయాన్ని బీజేపీ అందుకోబోతోందని గోయల్ వ్యాఖ్యానించారు. రూ.40వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఏకంగా రూ.1.30 లక్షల కోట్లకు పెంచిందన్నారు. దేశ చరిత్రలో ఇంత భారీ స్థాయికి జల ప్రాజెక్టు వ్యయాన్ని పెంచడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి, నెట్టెంపాడు ప్రాజెక్టులను కూడా కేసీఆర్ సర్కారు విస్మరించిందని తెలిపారు.

కేంద్రం నిధుల దుర్వినియోగం

గత 8 ఏళ్లలో కేంద్రం  ఇచ్చిన నిధులనూ దుర్వినియోగం చేసిందన్నారు. రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలు దక్కుతాయనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను  టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని చెప్పారు. రాష్ట్రంలో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను చేర్చడంపై కేసీఆర్ దృష్టిపెట్టలేదని విమర్శించారు. వీటన్నింటిని చూస్తుంటే.. ఒక్క కుటుంబం కోసమే తెలంగాణ వచ్చినట్లు కనిపిస్తోందన్నారు.