గజం వంద రూపాయలేనా?

గజం వంద రూపాయలేనా?

టీఆర్​ఎస్​ పార్టీ ఆఫీసులకు ఇచ్చిన భూములపై హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్​, వెలుగు: టీఆర్​ఎస్​ పార్టీకి గజం స్థలాన్ని వంద రూపాయలకే ఇచ్చేలా ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్​ చేస్తూ హైకోర్టులో పిటిషన్​ దాఖలైంది. టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం ఈ వ్యాజ్యం వేశారు. పార్టీలకు భూమిని లీజుకిచ్చేలా గతంలో ఇచ్చిన జీవో 167 ఆధారంగా, ఈ ఏడాది జూన్​లో సర్కార్​ జీవో 66 ఇచ్చిందని పిటిషన్​లో పేర్కొన్నారు. ‘‘1987 నాటి 167 జీవో ప్రకారం ఎకరం మించకుండా భూమిని 30 ఏళ్లకు మాత్రమే లీజుకు ఇచ్చేందుకు వీలుంది. అయితే, దానిని ఆధారంగా చేసుకుని 24 జిల్లాల్లో టీఆర్​ఎస్​ పార్టీ ఆఫీసుల కోసం వంద రూపాయలకే గజం స్థలాన్నిచ్చేలా సర్కార్​ జీవో 66ను విడుదల చేసింది. ఆ స్థలం లీజుకో కాదో మాత్రం ఉత్తర్వుల్లో చెప్పలేదు. కాబట్టి ఆ రెండు జీవోల అమలును ఆపేస్తూ తాత్కాలిక ఆదేశాలివ్వండి. కేసును పూర్తిగా విచారించాక జీవో చెల్లుబాటును కొట్టేయాలి” అని పిటిషన్​లో మేడిపల్లి సత్యం కోరారు.

ఇలా భూములిచ్చుకుంటూ పోతే సర్కార్​ ఖజానాకు నష్టమేనన్నారు. ప్రజా అవసరాల కోసమే ప్రభుత్వ స్థలాలను వాడుకోవాలని, కానీ, పార్టీల అవసరాల కోసం వాడుకోవడం రాజ్యాంగ వ్యతిరేకమని అన్నారు. ప్రభుత్వం భూముల్ని పంచుతూ పోవడం దారుణమన్నారు. అధికారంలో ఉన్న పార్టీ ఇష్టానుసారంగా భూముల్ని రాజకీయ అవసరాల కోసం ఇచ్చుకుంటూపోతే ఎలా అని పిటిషన్​లో ప్రశ్నించారు. దీనిని అడ్డుకోవాలని కోరారు. గుర్తింపు పొందిన పార్టీలన్నింటి వాదనలు వినాలని కోరారు. ఆ తర్వాత ఆ రెండు జీవోలనూ రద్దు చేయాలన్నారు. పిటిషన్​లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, భూ పరిపాలన చీఫ్​ కమిషనర్​లతోపాటు పలు పార్టీలను ప్రతివాదులుగా చేశారు