వడ్ల నిల్వ కోసం ఆధునిక సైలోలు..10 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యంతో  ప్రతిపాదనలు

వడ్ల నిల్వ కోసం ఆధునిక సైలోలు..10 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యంతో  ప్రతిపాదనలు
  •     ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటు
  •      రెండు నమూనాలపై  మంత్రి ఉత్తమ్​ సమీక్ష

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఎక్కువ కాలం వడ్లు నిల్వ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా అత్యాధునిక సైలోల (పెద్ద స్టీల్ ట్యాంకులు)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. సైలోలతో10 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కల్పించేలా ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నది. శనివారం -సెక్రటేరియెట్​లో సివిల్ సప్లయ్స్​శాఖ మంత్రి ఉత్తమ్‌‌‌‌కుమార్‌‌‌‌రెడ్డి సైలోల నిర్మాణం, నిర్వహణ, నిధుల సమీకరణకు సంబంధించిన ప్రతిపాదనలపై అధికారులతో కలిసి సమీక్షించారు. సైలోల ఏర్పాటుకు రెండు నమూనాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.  -సివిల్​ సప్లయ్స్​ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడమా? లేదంటే ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటు చేయడమా అనే దానిపై సమాలోచన చేస్తున్నట్లు చెప్పారు. 

ఒకే చోట అన్ని సదుపాయాలు.. 

సైలో కేంద్రాల్లో ధాన్యం తూకం వేసేందుకు వేబ్రిడ్జిలు, తేమ, నాణ్యతను పరీక్షించేందుకు ల్యాబ్​లు ఉంటాయి. ధాన్యంలో ఉండే మట్టి, చెత్త వంటి వేస్టేజ్​ను యంత్రాల ద్వారా తొలగించి, ధాన్యాన్ని డ్రయర్లతో ఆరబెడతారు. అనంతరం యంత్ర పరికరాల సాయంతో నేరుగా భారీ ఉక్కు సైలోల్లోకి తరలించి నిల్వ చేస్తారు. ఈ విధానంతో గోనె సంచుల వినియోగం తగ్గడంతోపాటు నిల్వ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సైలోల ఏర్పాటుకు ప్రభుత్వం రెండు విధానాలను పరిశీలిస్తోందని చెప్పారు. మొదటి నమూనాలో  సివిల్​ సప్లయ్స్ శాఖ గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థల నుంచి రుణాలు సమీకరించి నేరుగా సైలోలను నిర్మిస్తామన్నారు. రెండో నమూనాలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 చోట్ల   ప్రైవేటు పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో సైలోలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

 ప్రీమియం రకాలకు పెరుగుతున్న ఆదరణ

జేఎస్‌‌‌‌ఆర్‌‌‌‌, ఆర్‌‌‌‌ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌, హెచ్‌‌‌‌ఎంటీ వంటి తెలంగాణ వరి రకాలకు దేశీయ, విదేశీ మార్కెట్లలో ఆదరణ పెరుగుతోందని ఉత్తమ్‌‌‌‌కుమార్‌‌‌‌రెడ్డి తెలిపారు. కొన్ని మార్కెట్లలో జైశ్రీరాం రకం బియ్యం బాస్మతి కంటే అధిక ధర పలుకుతోందని పేర్కొన్నారు. వానాకాలం, యాసంగి రెండు సీజన్లలోనూ రాష్ట్రంలో ప్రధాన పంటగా ఉన్న వరికి మెరుగైన నిల్వ సదుపాయాలు కల్పించడం వ్యవసాయ రంగ అభివృద్ధికి, రాష్ట్ర జీడీపీ పెరుగుదలకు దోహదపడుతుందని చెప్పారు. తెలంగాణను 3 ట్రిలియన్‌‌‌‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి సైలోల ఏర్పాటు తోడ్పడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. సమీక్షలో సివిల్ సప్లయ్స్ శాఖ కమిషనర్‌‌‌‌ స్టీఫెన్‌‌‌‌ రవీంద్ర, అడిషనల్​ డైరెక్టర్‌‌‌‌ రోహిత్‌‌‌‌ సింగ్‌‌‌‌ పాల్గొన్నారు.