సాగర్ వద్ద ఏపీ అధికారులను అడ్డుకున్నపోలీసులు

సాగర్ వద్ద ఏపీ అధికారులను అడ్డుకున్నపోలీసులు


వెలుగు నెట్​వర్క్:నాగార్జునసాగర్ పవర్​ప్లాంట్​లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని కోరుతూ సాగర్ కొత్త బ్రిడ్జి వద్దకు వచ్చిన ఏపీ ఉద్యోగులను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. గురువారం ఏపీకి చెందిన ఆర్డీవో, పోలీసులు, ఇతర ఉద్యోగులు మాచర్ల వైపు నుంచి నాగార్జునసాగర్ కొత్త బ్రిడ్జి వద్దకు వచ్చారు. సాగర్​పవర్​ప్లాంట్​లో విద్యుత్ ఉత్పత్తిని ఆపేయాలని తెలంగాణ జెన్​కో ఉద్యోగులకు వినతిపత్రం అందించేందుకు వచ్చామని వారు చెప్పారు. అయితే ఎవరిని అనుమతించబోమని తెలంగాణ పోలీసులు వారికి చెప్పారు. దాంతో తామంతా కాకుండా ఒకరు మాత్రమే వెళ్లి జెన్​కో అధికారులకు వినతిపత్రం అందిస్తామని చెప్పారు. దానికి సైతంవారు నిరాకరించారు. తిరిగి ఏపీకి వెళ్లిపోవాలని చెప్పడంతో అక్కడి నుంచి వారు వెళ్లిపోయారు. తర్వాత ఏపీ పోలీసు బలగాలు ఆ రాష్ట్రంలోని రైట్​బ్యాంక్​వద్ద మోహరించాయి. అంతకుముందు రైట్​బ్యాంక్ గెస్ట్ హౌస్​లో నల్గొండ డీఐజీ రంగనాథ్, గుంటూరు డీఎస్పీ విశాల్​గున్నితో సమావేశం నిర్వహించారు. సాగర్ పరిసరాల్లో భద్రతను డీఐజీ సమీక్షించారు. సాగర్​లోని జెన్​కో పవర్ ప్లాంట్ వద్ద పోలీసులు కంచె ఏర్పాటు చేశారు. విద్యుత్​ ఉత్పత్తి కేంద్రం వైపు ఎవరూ వెళ్లకుండా తెలంగాణ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు. 

పులిచింతలపై వినతిపత్రం అందజేత

తమ అనుమతి లేకుండా చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలంటూ ఏపీ ఇరిగేషన్ ఎస్​ఈ రమేశ్​బాబు తెలంగాణ జెన్ కో ఎస్​ఈ దేశ్యాకు గురువారం పులిచింతల ప్రాజెక్టుపై వినతిపత్రాన్ని అందజేశారు. రెండ్రోజులుగా జెన్ కో వద్ద తెలంగాణ పోలీసులు భద్రత ఏర్పాటు చేయగా, తాజాగా మధ్యాహ్నం నుంచి  ప్రాజెక్టు వద్ద ఏపీ పోలీసులు భారీగా మోహరించారు. ఏపీ అధికార పార్టీ లీడర్లు ప్రాజెక్టు వద్దకు తరలిరానున్నారని ప్రచారం జరిగింది. వినతిపత్రం అందించే సమయంలోనూ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఏపీ ఆఫీసర్లను జెన్​కో ఆఫీసులోకి అనుమతించకుండా ప్రాజెక్టు మీదనే వినతిపత్రాన్ని స్వీకరించారు. జెన్ కో ఉన్నతాధికారులకు లెటర్​పంపనున్నట్లు ఎస్ఈ దేశ్యా వారికి చెప్పారు.

నీటి లెక్కల్లో తేడా

జెన్ కో లో విద్యుత్ ఉత్పాదనకు మొత్తం నాలుగు యూనిట్లు ఉన్నాయి. ప్రస్తుతం 1, 3 యూనిట్ల ద్వారా కరెంట్ ఉత్పత్తి జరుగుతోంది. ఒక్కో యూనిట్ రన్ కావడానికి రెండు వేల క్యూసెక్కుల నీరు అవసరం ఉంటుంది. ఆ లెక్కన రెండు యూనిట్లు నడవడానికి నాలుగు వేల క్యూసెక్కుల నీరు అవసరం. అయితే ఎపీ ఇరిగేషన్ అధికారులు మాత్రం కరెంట్ కోసం 6,900 క్యూసెక్కుల నీటిని వాడుతున్నట్లు వినతిపత్రంలో లెక్కచూపడం గమనార్హం.

శ్రీశైలం పవర్ ప్లాంట్ వద్ద భారీ భద్రత 

కృష్ణా నది జలాల వినియోగంపై తెలంగాణ, ఏపీల మధ్య మాటామాటా పెరుగుతున్న నేపథ్యంలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌజ్​కు అదనపు భద్రత కల్పించారు. ఏపీ నుంచి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ వద్ద నిరసన చేపట్టవచ్చన్న అనుమానంతో ట్రాన్స్‌‌కో, జెన్​కో సీఎండీ ప్రభాకర్​ రావు భద్రత కల్పించాలని కోరారు. దీంతో పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యుత్​ ప్లాంట్​లో పనిచేసే సిబ్బంది మినహా ఇతరులను అనుమతించడం లేదు. మరోవైపు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్​లోని ఆరు యూనిట్లలో రెండు మూలకు పడగా ప్రస్తుతం నాలుగు పనిచేస్తున్నాయి. ఒక్కోటి 150 మెగావాట్ల కెపాసిటీ ఉండగా, ప్రస్తుతం డిమాండ్​ను బట్టి 600 మెగావాట్ల వరకు పవర్ జనరేట్ చేస్తున్నారు.