సెలక్టయినా… ట్రైనింగ్​ ఇస్తలేరు

సెలక్టయినా…  ట్రైనింగ్​ ఇస్తలేరు

తెలంగాణ స్టేట్‌‌‌‌ లెవల్‌‌‌‌ పోలీస్‌‌‌‌ రిక్రూట్​‌‌మెంట్‌‌‌‌ బోర్డు ద్వారా 17,156 మంది పోలీస్‌‌‌‌ కానిస్టేబుళ్ల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం 2018 మే 31న నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేసింది. ప్రిలిమినరీ పరీక్షలో పాసైన వారికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి అందులో ఉత్తీర్ణులైన వారికే మెయిన్‌‌‌‌ ఎగ్జామ్‌‌‌‌ నిర్వహిస్తామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. 2018 సెప్టెంబర్‌‌‌‌ 30న ప్రిలిమినరీ రాశారు. సెలక్ట్‌‌‌‌ అయిన వాళ్లకు 2019 ఫిబ్రవరి‒మార్చి నెలల్లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో సెలక్టైన వారు 2019 ఏప్రిల్‌‌‌‌ 28న మెయిన్‌‌‌‌ ఎగ్జాం రాశారు.

5 నెలల తర్వాత ఫలితాలు

మెయిన్‌‌‌‌ ఎగ్జాం రాసిన తర్వాత నెలలపాటు ఫలితాల కోసం నిరుద్యోగులంతా ఎదురుచూడాల్సి వచ్చింది. ప్రతిపక్ష పార్టీల నుంచి వచ్చిన ఒత్తిళ్లు, నిరుద్యోగ సంఘాల పోరాటాలతో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు 5 నెలల తర్వాత 2019 సెప్టెంబర్‌‌‌‌ 24న ఫలితాలను ప్రకటించింది. 17,156 పోస్టులకు నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేయగా 16,025 మంది సెలక్ట్‌‌‌‌ అయినట్లుగా తెలంగాణ స్టేట్‌‌‌‌ లెవల్‌‌‌‌ పోలీస్‌‌‌‌ రిక్రూట్​‌‌మెంట్‌‌‌‌ బోర్డు ప్రకటించింది.  వీరిలో 13,373 మంది పురుషులు, 2,652 మంది స్త్రీలు ఉన్నారు. ఫలితాల్లో పెద్దఎత్తున తప్పులు  జరిగినట్లుగా విమర్శలు వచ్చాయి. తక్కువ మార్కులు వచ్చినవాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారని.. ఎక్కువ మార్కులు వచ్చినవాళ్లకు ఇవ్వలేదని పరీక్షకు హాజరైన వారినుంచి నిరసన వ్యక్తమైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఛాలెంజింగ్‌‌‌‌ లెటర్లను స్వీకరించి కొందరికి పోలీసు ఉద్యోగాలను ఇచ్చింది.

స్పెషల్‌‌‌‌ పోలీస్‌‌‌‌ కానిస్టేబుళ్లకు మొండిచెయ్యి

ఒకే నోటిఫికేషన్‌‌‌‌, ఒకే సెలక్షన్‌‌‌‌ ద్వారా ఎంపికైన పోలీస్‌‌‌‌ కానిస్టేబుళ్లందరికి ఒకేసారి ట్రైనింగ్‌‌‌‌ ఇవ్వాలి. సివిల్‌‌‌‌ , ఆర్మ్‌‌‌‌డ్‌‌‌‌ రిజర్వ్‌‌‌‌డ్‌‌‌‌(ఏఆర్‌‌‌‌), స్పెషల్‌‌‌‌ పోలీస్‌‌‌‌, పోలీస్‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌, స్పెషల్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌ కానిస్టేబుల్‌‌, ఫైర్‌‌‌‌మెన్‌‌‌‌, జైలు వార్డర్స్, ఐటీ.. కమ్యూనికేషన్స్‌‌‌‌కానిస్టేబుల్‌‌‌‌ మెకానిక్స్‌‌, కానిస్టేబుల్‌‌‌‌ డ్రైవర్స్‌‌‌‌ వంటి పది విభాగాలలో 16,025 మంది ఎంపికయ్యారు. వీరిలో స్పెషల్‌‌‌‌ పోలీస్‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌ విభాగానికి చెందిన 4,734  మందిని మినహా మిగతా  9 విభాగాలకు చెందిన 11,291 మందికి జనవరి 17 నుంచి ట్రైనింగ్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12 పోలీస్‌‌‌‌ బెటాలియన్లలో వీరికి శిక్షణ షురూ అయ్యింది.

జీతం నై.. సర్వీస్‌‌‌‌ రూల్స్‌‌‌‌ ఎలా?

పోలీస్‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌ ఎంపికలో స్పెషల్‌‌‌‌ పోలీస్‌‌‌‌ కానిస్టేబుళ్లుగా ఎంపికైన వారంతా శిక్షణకు వెళ్లకపోవడంతో వీరికి నెల జీతం రావడం లేదు. శిక్షణ సమయంలో నెలకు రూ.9 వేల చొప్పున కానిస్టేబుళ్లకు జీతం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శిక్షణ పూర్తయిన తర్వాత పోస్టింగ్‌‌‌‌ ఇచ్చి జీతం పెంచుతామని పేర్కొంది. అయితే  10 విభాగాల వారికి శిక్షణ మొదలుకావడంతో జీతం తీసుకుంటున్నారు. ఇదీ కాక సర్వీస్‌‌‌‌ రూల్స్‌‌‌‌ పరిస్థితి ఏంటో తెలియక శిక్షణకు వెళ్లని వాళ్లంతా నరకయాతన అనుభవిస్తున్నారు. ట్రైనింగ్‌‌‌‌ పూర్తికాగానే పోస్టింగ్‌‌‌‌ ఆర్డర్స్‌‌‌‌ ఇస్తారు. విధుల్లో చేరిన రోజు నుంచి రెండేళ్ల పీరియడ్‌‌‌‌ను ప్రొబేషన్‌‌‌‌ పీరియడ్‌‌‌‌గా పరిగణిస్తారు. రెండేళ్ల పీరియడ్‌‌‌‌ పూర్తికాగానే ఉద్యోగాన్ని పర్మినెంట్‌‌‌‌ చేస్తారు. ప్రస్తుతమున్నవారికి ట్రైనింగ్‌‌‌‌ పూర్తయ్యాక.. తమకు స్టార్ట్‌‌‌‌ చేస్తే  9 నెలల సర్వీస్‌‌‌‌ కోల్పోతామని.. భవిష్యత్‌‌‌‌లో సీనియారిటీ ప్రకారం వచ్చే పదోన్నతులు కూడా కోల్పోవాల్సి వస్తుందని బాధ పడుతున్నారు.

డీజీపీ ఆఫీస్, మంత్రుల చుట్టూ చక్కర్లు

తమకు కూడా ట్రైనింగ్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేయాలని.. లేకపోతే ట్రైనింగ్​కు వెళ్లిన వాళ్లలాగే తమకు కూడా జీతం చెల్లించాలని కోరుతూ స్పెషల్‌‌‌‌ పోలీస్‌‌‌‌ కానిస్టేబుళ్లు రాష్ట్ర డీజీపీ కార్యాలయం, మంత్రుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అసలు తమను ఎందుకు శిక్షణకు పిలవలేదో తెలుసుకోవాలని ఎన్నిసార్లు ఉన్నతాధికారులను కలిసినా ఎవరినుంచి సరైన సమాధానం రావడం లేదని చెబుతున్నారు. అసలు తమకు ఎప్పుడు ట్రైనింగ్‌‌‌‌ ఇస్తారో.. కనీసం తేదీ అయిన ప్రకటించాలని కోరినా ఎవరినుంచి సమాధానం రావడం లేదని కంటతడి పెడుతున్నారు. ఈ నెల 16న ‘చలో డీజీపీ కార్యాలయం’ పేరుతో హైదరాబాద్‌‌‌‌కు పోతున్నట్లుగా పలువురు కానిస్టేబుళ్లు పేర్కొన్నారు.