జహీరాబాద్​లో గెలిచెదెవరో!..టికెట్ల వేటలో ఆశావాహులు

జహీరాబాద్​లో గెలిచెదెవరో!..టికెట్ల వేటలో ఆశావాహులు
  • గెలుపే లక్ష్యంగా పొలిటికల్​ పార్టీల కసరత్తు

సంగారెడ్డి, వెలుగు : జహీరాబాద్ పార్లమెంట్ స్థానంపై పొలిటికల్​పార్టీలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి పోటీచేసే ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గెలిచే క్యాండిడేట్లను జల్లెడపట్టే పనిలో ఆయా పార్టీలు నిమగ్నమయ్యాయి. సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల పరిధిలోని ఏడు నియోజకవర్గాలను కలుపుకొని 2009లో జహీరాబాద్ సెగ్మెంట్ ఏర్పడింది. మొదటిసారి ఈ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సురేశ్ షెట్కార్ గెలుపొంది ఎంపీ అయ్యారు. 2014, 2019లలో టీఆర్ఎస్ నుంచి పోటీచేసిన బీబీ పాటిల్ వరుసగా రెండుసార్లు విజయం సాధించారు.

 ఈసారి జహీరాబాద్​సెగ్మెంట్​లో ఉన్న మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాలుగు, బీఆర్ఎస్ రెండు, బీజేపీ ఒకచోట గెలిచాయి.  అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీచేసిన  కాటిపల్లి వెంకటరమణారెడ్డి అప్పటి సీఎం కేసీఆర్​, ప్రస్తుత సీఎం రేవంత్​రెడ్డిని ఓడించి చరిత్ర సృష్టించారు. దీంతో  ప్రధాన పొలిటికల్​ పార్టీలు ఈ స్థానంపై స్పెషల్​ఫోకస్​ పెట్టాయి. ఇక్కడ ఎలాగైన గెలిచి పట్టు నిలుపుకోవాలని భావిస్తున్నాయి. 

పార్టీల వారీగా ఆశావాహులు..

బీఆర్​ఎస్​ నుంచి సిట్టింగ్​ఎంపీ బీబీ పాటిల్ మూడోసారి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీఆర్ఎస్ తరఫున టికెట్టు ఆశించే వారు మాజీ సీఎం కేసీఆర్ ను కలుస్తున్నప్పటికీ బీబీ పటేల్ నే మళ్లీ పోటీ చేయించాలని కేసీఆర్​భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్ తోపాటు జహీరాబాద్ మాజీ ఎంపీపీ చిరాక్ పల్లి నారాయణరెడ్డి తనయుడు ఎన్ఆర్ఐ ఉజ్వల్ రెడ్డి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. కానీ పార్టీ హైకమాండ్​ సురేశ్ షెట్కార్ వైపే మొగ్గుచూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ నుంచి దివంగత మాజీ ఎంపీ ఆలే నరేంద్ర కుమారుడు ఆలే భాస్కర్ తో పాటు

 దివంగత మాజీ ఎంపీ బాగారెడ్డి కొడుకు జైపాల్ రెడ్డి, కామారెడ్డికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి టికెట్లు ఆశిస్తున్నారు. హైకమాండ్ దగ్గర ఎవరికి వారు పైరవీలు చేసుకుంటూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.  ఇందులో ఒకరు ఢిల్లీలో అమిత్ షాను కలిసోచ్చాక టికెట్ తనకేనని ప్రచారం చేసుకుంటుండగా, మరొకరు పార్టీ రాష్ట్ర చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తనకు మాటిచ్చారని తనకే టికెట్ వస్తుందనే నమ్మకంతో పని చేసుకుంటున్నారు. 

గత ఎన్నికల ఫలితాలు ఇలా..

జహీరాబాద్ పార్లమెంట్ లో 2009 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ రెండుసార్లు, కాంగ్రెస్ ఒక్కసారి విజయం సాధించాయి. 2009లో మొదటిసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సురేశ్ షెట్కార్ టీఆర్ఎస్ అభ్యర్థి యూసుఫ్ అలీ మీద 17,407 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2014 లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న సురేశ్ షెట్కార్ పై టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ 1.44 లక్షల భారీ మెజార్టీతో విజయం సాధించారు. 

కానీ 2019 ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్ రావుపై సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ 6,229 స్వల్ప ఆధిక్యంతో బయటపడ్డారు. కాగా ఆ రోజు రెండో స్థానంలో నిలిచిన మదన్మోహన్ రావు తాజాగా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 24,001 ఓట్లతో గెలుపొందారు. అయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్ నుంచి గెలుపొందేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.