ఓవర్ టు ఢిల్లీ...దేశ రాజధానిలో తెలంగాణ పాలిటిక్స్

ఓవర్ టు ఢిల్లీ...దేశ రాజధానిలో తెలంగాణ పాలిటిక్స్
  • బీఆర్​ఎస్​, బీజేపీ, కాంగ్రెస్​ ముఖ్య నేతలు అక్కడే
  • ఢిల్లీలోనే కిషన్​రెడ్డి,  ఈటల, రాజగోపాల్​రెడ్డి
  • ఇయ్యాల పొంగులేటి, జూపల్లి, 
  • హస్తిన టూర్​లో కేటీఆర్..  ప్రభుత్వ, పార్టీ వ్యవహారాల్లో నిమగ్నం

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణ రాజకీయాలు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్​ ముఖ్య నేతలు అక్కడ మోహరించారు. మంత్రి కేటీఆర్ ​శుక్రవారమే ఢిల్లీకి వెళ్లి వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు. పనిలో పనిగా బీఆర్​ఎస్​  వ్యవహారాలను కూడా ఆయన చక్కబెట్టేస్తున్నారనే చర్చ నడుస్తున్నది. తెలంగాణ బీజేపీలోని వరుస పరిణామాలపై పార్టీ హైకమాండ్​ ఫోకస్​ పెట్టింది. ఇందులో ఈ క్రమంలోనే బీఆర్ఎస్​ మాజీ నేతలు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహా ఇతర నేతలను పార్టీలోకి ఆహ్వానించింది. వీళ్లతోపాటు పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి, పలువురు రాష్ట్ర కాంగ్రెస్​ నేతలు ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. వీరందరితో సోమవారం కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ సమావేశం కానున్నారు. ఇప్పటికే పలువురు రాష్ట్ర కాంగ్రెస్​ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు.  కాంగ్రెస్​ను కొందరు నేతలు వీడుతారన్న ప్రచారంపైనా ఆ పార్టీ హైకమాండ్​ దృష్టి సారించింది.

బీఆర్​ఎస్​ అసంతృప్తులపై కాంగ్రెస్​ గురి

రాష్ట్ర అసెంబ్లీకి నవంబర్​ నెలాఖరులో, లేదా డిసెంబర్​ ప్రారంభంలో ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమవడంతో పాటు ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నది. అక్టోబర్​ రెండో వారంలోనే అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్​ వెలువడే అవకాశముందని అధికారవర్గాల్లో చర్చ సాగుతున్నది. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. మూడోసారి గెలిచి మళ్లీ అధికారం చేపట్టాలని  కేసీఆర్​ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కర్నాటక ఎన్నికల్లో భారీ విజయం తర్వా త తెలంగాణ కాంగ్రెస్​లోనూ హుషారొచ్చింది. 

రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్​ను గద్దె దించేది తామేనని ధీమా వ్యక్తం చేస్తున్నది. ఇందులో భాగంగా బీఆర్ఎస్​ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సహా బీఆర్​ఎస్​పై అసంతృప్తితో ఉన్న నేతలను తమవైపు తిప్పుకునే పనిలో నిమగ్నమైంది.  భాగంగా కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుంది. వారితో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం రాత్రి సమావేశమయ్యారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో జోష్​ మీదున్న కాంగ్రెస్​ తెలంగాణలోనూ పట్టు సాధించేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నది.  

రూట్​ మార్చిన బీఆర్​ఎస్​

రెండున్నరేండ్లుగా కేంద్ర ప్రభుత్వ మీటింగ్​లకు దూరంగా ఉంటూ వస్తున్న కేసీఆర్​ సర్కారు ఇప్పుడు రూట్​ మార్చింది. మణిపూర్​లో నెలకొన్న పరిస్థితులపై శనివారం కేంద్ర హోం మంత్రి అమిత్​షా అధ్యక్షతన ఢిల్లీలోని పార్లమెంట్ ​లైబ్రరీలో నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్​లో బీఆర్ఎస్​ ప్రతినిధిగా ప్లానింగ్​ బోర్డు వైస్​ చైర్మన్​ వినోద్​ కుమార్​ పాల్గొన్నారు. గతంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​ ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లినా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులను కలిసే ప్రయత్నం చేయలేదు. కానీ, ఇప్పుడు అమిత్​షా సహా పలువురు కేంద్ర మంత్రులను కేటీఆర్​ అపాయింట్​మెంట్ ​అడిగి ఢిల్లీకి వెళ్లారు. శనివారం రాత్రి అమిత్​షాతో భేటీ కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో సమావేశం రద్దయింది.

పరిస్థితులు చక్కదిద్దే పనిలో బీజేపీ

దుబ్బాక బైపోల్​లో గెలుపు జోష్​తో బీజేపీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​కు బ్రేకులు వేసింది. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఘన విజయం బీజేపీకి మరింత ఊపుతెచ్చింది. మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోయినా పార్టీ బలం గణనీయంగా పెరిగింది. అయితే.. కర్నాటక ఎన్నికల తర్వాత తెలంగాణ బీజేపీలో కాస్త స్తబ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ అలర్టయింది. పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కిషన్​రెడ్డి, ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్ ​రెడ్డితో నడ్డా భేటీ అయ్యారు. రాష్ట్ర బీజేపీలో ప్రస్తుత పరిణామాలు, అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం ఇతర అంశాలపై వారితో ఢిల్లీ పెద్దలు చర్చించినట్టుగా సమాచారం.