బిడ్డ పుట్టిన పది రోజులకు బాలింత మృతి

బిడ్డ పుట్టిన పది రోజులకు బాలింత మృతి
  • డెలివరీ తర్వాత అబ్జర్వేషన్ పేరుతో హాస్పిటల్​లోనే..
  • డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యుల  ఆరోపణ

ఖైరతాబాద్ : బిడ్డ పుట్టిన పది రోజులకే బాలింత చనిపోగా.. డెలివరీ చేసిన డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ సోమాజిగూడ డెక్కన్ హాస్పిటల్ ఎదుట ఆమె కుటుంబసభ్యులు ఆదివారం ఆందోళన చేశారు.  గోదావరిఖనికి చెందిన మాతంగి రాజయ్య రెండో కూతురు మాతంగి సుమలత (35)కు మాటలు రావు, వినిపించదు. పదేండ్ల కిందట సుమలతను కొత్తగూడెంకు చెందిన ధరణికుమార్​కు ఇచ్చి పెండ్లి చేశారు. గర్భిణిగా ఉన్న సుమలత నెలవారీ చెకప్​ల కోసం కొంతకాలం నుంచి గోదావరిఖనిలోని అంబికా హాస్పిటల్​కు వెళ్తోంది. ఇటీవల రెగ్యులర్ చెకప్ కోసం ఆమె అదే హాస్పిటల్​కు వెళ్లగా.. సుమలత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతోందని,  మెరుగైన ట్రీట్ మెంట్  కోసం కరీంనగర్​లోని హాస్పిటల్​కు వెళ్లాలని డాక్టర్లు సూచించారు. సుమలతను ఆమె కుటుంబసభ్యులు అంబులెన్స్ లో కరీంనగర్ కు తీసుకెళ్తుండగా.. వెహికల్​ డ్రైవర్ జయవర్ధన్ ద్వారా సోమాజిగూడలోని డెక్కన్ హాస్పిటల్ మార్కెటింగ్ ప్రతినిధి రమేష్ వారికి పరిచయమయ్యాడు. అన్నీ తాము చూసుకుంటామని చెప్పిన రమేశ్.. ​ఈ నెల 9న సుమలతను డెక్కన్ హాస్పిటల్​లో అడ్మిట్ చేయించాడు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు సుమలతకు సిజేరియన్ చేయగా.. ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

డెలివరీ తర్వాత సుమలత లంగ్స్ లో ఉమ్మ నీరు చేరిందని చెప్పి అక్కడి డాక్టర్లు అదే హాస్పిటల్​లో అబ్జర్వేషన్​లో ఉంచారు. ఈ నెల 20న తెల్లవారుజామున 5 గంటలకు సుమలత చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. హాస్పిటల్ ఫీజు కోసం ఉన్న భూమిని తాకట్టు పెట్టి రూ.7 లక్షలు కట్టామని.. డాక్టర్ల నిర్లక్ష్య కారణంగానే సుమలత చనిపోయిందని ఆమె తండ్రి రాజయ్య ఆరోపించాడు. బాధిత మహిళకు న్యాయం చేయాలంటూ కుటుంబసభ్యులు దివ్యాంగులతో కలిసి డెక్కన్ హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు. పంజాగుట్ట పోలీసులు అక్కడికి చేరుకుని వారిని పంపించేశారు. డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్​కు తరలించారు. రాజయ్య ఇచ్చిన కంప్లయింట్ మేరకు డెక్కన్ హాస్పిటల్​పై కేసు ఫైల్ చేసినట్లు పోలీసులు తెలిపారు.