హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ (టీపీజీఎల్) నాలుగో ఎడిషన్‌లో ఆటమ్ చార్జర్స్ టాప్ గేర్‌లో దూసుకెళ్తోంది. శనివారం జరిగిన మూడో రౌండ్‌లోనూ అదరగొట్టిన ఆటమ్ టీమ్ మొత్తంగా 532 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
హైదరాబాద్ గోల్ఫ్ కోర్సులో జరిగిన ఈ రౌండ్‌లో మూడు వేర్వేరు ఫార్మాట్లలోనూ ఆటమ్ గోల్ఫర్లు సత్తా చాటారు. మధుకర్ రావు పేరాల సింగిల్, డబుల్ వేరియేషన్స్‌లో టాప్ పెర్ఫార్మర్‌గా నిలిచాడు. నేహా అహ్లువాలియా జతగా జట్టుకు అత్యుత్తమంగా 33 స్కోరు చేశాడు. కెప్టెన్ భూషణ్ బైరాగని,పార్ట్‌నర్ గౌరవ్ అహ్లువాలియా కలిసి ఫామ్ కొనసాగిస్తూ 32 పాయింట్లు అందించారు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ (హెచ్‌జీఏ) నిర్వహిస్తున్న ఈ లీగ్‌లో మొత్తం 16 జట్లు పోటీ పడుతున్నాయి. నాలుగో రౌండ్ పోటీలు బుధవారం జరుగుతాయి.