- స్మోకింగ్, గుట్కా, గంజాయి, డ్రగ్స్ తీవ్రతను బట్టి కౌన్సెలింగ్
- నాలుగు సెంట్రల్ జైళ్లలో డీ అడిక్షన్ సెంటర్లలో ఖైదీలకు ట్రీట్‌మెంట్
- ఏడాదిలో 2,126 మంది ఖైదీల్లో మార్పు తెచ్చిన జైళ్లశాఖ
- విడుదలైన 300 మందిపై నిరంతర పర్యవేక్షణ
‘‘ ఓ సినిమా డైరెక్టర్ రెండేళ్లుగా కొకైన్ సహా డ్రగ్స్‌కు బానిసయ్యాడు. ఎన్‌డీపీఎస్ యాక్ట్ కేసులో అరెస్ట్ అయ్యి గతేడాది సెప్టెంబర్‌లో చంచల్‌గూడ జైలుకు వచ్చాడు. స్క్రీనింగ్‌తో తీవ్రతను గుర్తించిన నివృత్తి సిబ్బంది.. ఆయనకు 60 రోజుల పాటు డీ-అడిక్షన్ సేవలు అందించారు. ట్రీట్‌మెంట్‌తో పాటు కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సిలింగ్ ద్వార డైరెక్టర్ పూర్తిగా మారిపోయాడు. మళ్లీ మత్తుపదార్ధాల జోలికి వెళ్లలేదు. ఇండస్ట్రీలో తన స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులకు డ్రగ్స్ వల్ల తలెత్తే ప్రమాదాలపై అవగాహన కలిగించాడు.’’
హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్, గంజాయి, సిగరెట్లు, గుట్కా వంటి మాదకద్రవ్యాలకు బానిసైన ఖైదీల్లో మార్పు తీసుకొచ్చేందుకు రాష్ట్ర జైళ్లశాఖ చేపట్టిన ‘నివృత్తి’ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోంది. వివిధ నేరాల్లో అరెస్టై జైలుకు వచ్చిన ఖైదీలకు చెడు అలవాట్ల నుంచి బయటపడేలా కౌన్సెలింగ్, డీ-అడిక్షన్ చికిత్స అందిస్తున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా వారు బాధ్యతాయుతమైన జీవితం గడిపేలా ఫాలోఅప్ చేస్తున్నారు.
తెలంగాణ జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ శాఖ డీజీ డా. సౌమ్యమిశ్రా, ఐపీఎస్ నేతృత్వంలో అమలవుతున్న ‘నివృత్తి’ కార్యక్రమానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ‘స్కోచ్ అవార్డ్–2026’లో పురస్కారం దక్కింది. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్ కరెక్షన్స్ కాన్ఫరెన్స్ (ఐఆర్‌సీసీ)–2026లోనూ కార్యక్రమాన్ని ప్రదర్శించారు.
అడ్మిషన్ రోజే స్క్రీనింగ్
చంచల్‌గూడ, చర్లపల్లి, సంగారెడ్డి, నిజామాబాద్ సెంట్రల్ జైళ్లతో పాటు చంచల్‌గూడ మహిళా జైలులో ‘నివృత్తి’ డీ-అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో సైకాలజిస్ట్, కౌన్సిలర్, డాక్టర్ సహా ఏడుగురు చొప్పున సిబ్బంది పనిచేస్తున్నారు. రిమాండ్, అండర్‌ట్రయల్ ఖైదీలకు జైలులో అడ్మిషన్ రోజే మాదకద్రవ్యాల వినియోగంపై స్క్రీనింగ్ చేస్తున్నారు. స్మోకింగ్, గుట్కా, సింథటిక్ డ్రగ్స్, గంజాయి తదితర వ్యసనాల తీవ్రతను గుర్తించి కేటగిరీలుగా విభజిస్తున్నారు. అవసరాన్ని బట్టి కౌన్సెలింగ్, డీటాక్సిఫికేషన్, థెరపీ, వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా స్కోరింగ్, ట్రీట్‌మెంట్‌కు రిఫరల్, సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ఏడాదిలో 2,126 మందికి చికిత్స
గతేడాది జూన్ నుంచి రాష్ట్ర జైళ్లలో సుమారు 4,200 మంది ఖైదీలకు స్క్రీనింగ్ చేశారు. వారిలో వ్యసన తీవ్రత అధికంగా ఉన్న 2,126 మందికి కౌన్సెలింగ్, చికిత్స అందించారు. చికిత్స అనంతరం విడుదలైన 300 మంది ఖైదీలను ఆఫ్టర్‌కేర్ సిబ్బంది ద్వారా ఫాలోఅప్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులతోనూ సోషల్ వర్కర్ల ద్వారా సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. డ్రగ్స్‌కు బానిసైన ఓ సినిమా దర్శకుడు ఎన్‌డీపీఎస్ యాక్ట్ కేసులో అరెస్టై గతేడాది సెప్టెంబర్‌లో చంచల్‌గూడ జైలుకు వచ్చాడు.
స్క్రీనింగ్‌లో వ్యసనం తీవ్రంగా ఉన్నట్లు గుర్తించిన ‘నివృత్తి’ సిబ్బంది 60 రోజులపాటు డీ-అడిక్షన్ సేవలు అందించారు. చికిత్సతో పాటు కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఆయన వ్యసనం నుంచి బయటపడ్డారు. అనంతరం కుటుంబ సభ్యులు, స్నేహితులకు డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నట్లు జైళ్లశాఖ తెలిపింది.
అంతర్జాతీయ ప్రమాణాలతో కౌన్సెలింగ్
“జైలుకు వచ్చే వారిలో సత్ప్రవర్తన తీసుకురావడమే మా ముఖ్య ఉద్దేశం. మాదకద్రవ్యాలకు బానిసైన వారిలో సమూల మార్పు తీసుకొస్తున్నాం. డీ-అడిక్షన్ చికిత్స కోసం ఓ ఖైదీ తన బెయిల్‌ను కూడా వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. జైలు నుంచి విడుదలైన వారికి కుటుంబ సభ్యులు సహకరించాలి. వారు మళ్లీ వ్యసనానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మా డీ-అడిక్షన్ కేంద్రాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కౌన్సెలింగ్ అందిస్తున్నాం. ఖమ్మం, కరీంనగర్ జైళ్లలోనూ డీ-అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపించాం” అని తెలిపారు.
- డా. సౌమ్యమిశ్రా, డీజీ, జైళ్లశాఖ
