ప్రైవేట్ కాలేజీల బంద్ విరమణ.. సర్కార్‌తో మేనేజ్‌‌‌‌‌‌‌మెంట్ల చర్చలు సఫలం

ప్రైవేట్ కాలేజీల బంద్ విరమణ.. సర్కార్‌తో మేనేజ్‌‌‌‌‌‌‌మెంట్ల చర్చలు సఫలం
  • మూడు నాలుగు రోజుల్లో రూ.600 కోట్ల బకాయిల విడుదలకు డిప్యూటీ సీఎం భట్టి హామీ
  • త్వరలోనే మిగిలిన రూ.300 కోట్లు కూడా చెల్లిస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన బంద్‌‌‌‌‌‌‌‌ను ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు విరమించుకున్నాయి. ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం ప్రజాభవన్‌‌‌‌‌‌‌‌లో ప్రైవేట్ కాలేజీల మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్లతో చర్చలు జరిపారు. 

అనంతరం భట్టి మాట్లాడుతూ.. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు గతంలో చెప్పినట్టుగా రూ.1,200 కోట్లకు సంబంధించి రూ.600 కోట్లు ఇప్పటికే విడుదల చేశామని తెలిపారు.  మరో మూడు, నాలుగు రోజుల్లో రూ.600 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. మిగతా రూ.300 కోట్లకు సంబంధించి ప్రణాళికాబద్ధంగా పరిష్కారం చూపే దిశలో యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తామని, త్వరలోనే వాటిని కూడా మంజూరు చేస్తామని వెల్లడించారు.

తమ ప్రకటనతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు సానుకూలంగా స్పందించి బంద్‌‌ను విరమించుకుంటున్నట్టు ప్రకటించాయని పేర్కొన్నారు. ఈ నెల 8న లెక్చరర్లతో, ఈ నెల 15న విద్యార్థులతో చేపట్టాలని అనుకున్న కార్యక్రమాలను రద్దు చేశాయన్నారు. ఫీజు రీయింబర్స్‌‌మెంట్ బకాయిలను ప్రతినెలా ఎంతోకొంత తప్పనిసరిగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కళాశాలల సమస్యల పరిష్కారానికి ఒక కమిటీ వేయాలని గతంలో యాజమాన్యాలు కోరాయని, ఆ కోరిక మేరకు కమిటీని ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఫీజు బకాయిలు, కళాశాలల సమస్యలకు సంబంధించి ఎలాంటి సంస్కరణలు అవసరమో అధ్యయనం చేసి త్వరితగతిన నివేదిక ఇవ్వాలని కమిటీని కోరామన్నారు. 

ఇకపై స్టూడెంట్లను రోడ్ల పైకి తీసుకురాం: రవికుమార్ 
ఈ నెల 8న టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌‌తో హైదరాబాద్​లో సమావేశం నిర్వహించాలనుకున్నామని, అయితే ప్రభుత్వంతో చర్చించాక దాన్ని విరమించుకున్నామని ఫతి సంఘం జనరల్ సెక్రటరీ రవికుమార్ తెలిపారు. ‘‘మేం పొరపాటున కోర్టుకు వెళ్లాం. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టవద్దని కోర్టు తెలిపింది. విద్యార్థులను రోడ్ల పైకి తీసుకురావొద్దని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఇకపై విద్యార్థులను బయటకు తీసుకురాం” అని చెప్పారు. 

ఈ నెల 3 నుంచి సమ్మె చేయడం కారణంగా కొన్ని పరీక్షలు, తరగతులు నిర్వహించలేకపోయామని.. అందుకు చింతిస్తున్నామని ఫతి సంఘం అధ్యక్షుడు నిమ్మటూరి రమేశ్ బాబు అన్నారు. నిలిచిపోయిన పరీక్షలకు సంబంధించి యూనివర్సిటీలతో మాట్లాడి త్వరలోనే తిరిగి నిర్వహిస్తామని తెలిపారు. తమ మాటలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయని.. తాము విద్యాశాఖ కార్యదర్శి శ్రీదేవసేన, ఇతర అధికారులెవరినీ ఒక్క మాట అనలేదన్నారు.