రానున్న మూడు రోజులు భారీ వర్షాలు..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..

రానున్న మూడు రోజులు భారీ వర్షాలు..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జులై 04వ తేదీ మంగళవారం సాయంత్రం నుంచి హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి వాన  దంచి కొడుతోంది. వరంగల్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లోనూ భారీ వర్షం పడుతోంది. వానల ధాటికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి.  జులై 04వ తేదీ  జనగాం జిల్లాలోని నర్మెట్టలో 36.8 మి.మీ, కొడకండ్ల ఏరియాలో 25 మి.మీ, ఖమ్మం జిల్లాలోని వైరాలో 36 మి.మీ, నారాయణపేటలో 19.2 మి.మీ, ఉట్కూర్‌లో 18 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

బుధవారం కూడా భారీ వానలు..

జులై 05వ తేదీ బుధవారం కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ ప్రకటించింది. రానున్న  మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బుధవారం జులై 05వ తేదీన  జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది.పెద్దపల్లి,ఖమ్మం, సూర్యాపేట, జనగాం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్.  జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం  జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. 

జులై 06వ తేదీ పెద్దపల్లి, నిజామాబాద్, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది.  మరికొన్ని జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది.


జులై 7వ తేదీ కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.  మెదక్, కామారెడ్డి, జనగాం, వరంగల్, ములుగు, మహబూబాబాద్, హనుమకొండ, జయంశర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో  భారీ వానలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరికొన్ని జిల్లాల్లో కూడా  మోస్తరు  వానలు పడతాయని స్పష్టం చేసింది.  భారీ వర్షాలు..అతి భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.