- ఫీల్డ్ లో ఉండే ఏఈలకు ల్యాప్ టాప్ లు అందిస్తం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
- ఆర్ అండ్ బీ ఇంజనీర్స్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ
హైదరాబాద్, వెలుగు: ఆర్ అండ్ బీ శాఖలో ఖాళీగా ఉన్న 265 ఇంజినీర్ల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. ఫీల్డ్‌లో ఉండే ఏఈలకు ల్యాప్ ట్యాప్‌లు అందిస్తామని చెప్పారు. రాష్ట్ర విభజనలో భాగంగా ఆంధ్రా వాళ్లతో ఉన్న పెండింగ్ సీనియారిటీ సమస్యలను కూడా త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. గురువారం ఆర్ అండ్ బీ శాఖ కార్యాలయంలో ఆర్ అండ్ బీ ఇంజనీర్స్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్ ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర పురోగతిలో రోడ్లు భవనాలు శాఖ కీలక భూమిక పోషిస్తున్నదన్నారు.
ఉద్యోగుల కోరిక మేరకు కొత్త సంవత్సరంలో అన్ని హంగులతో కూడిన ఆడిటోరియం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గ్లోబల్ సమ్మిట్ వేదికగా చరిత్రలో ఎన్నడు లేని విధంగా మొదటి సారి ఆర్ అండ్ బీ రోడ్ పాలసీని ఆవిష్కరించుకున్నామని మంత్రి తెలిపారు. శాఖ విజన్‌కు ఇది నిదర్శనమన్నారు. మన్ననూరు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, గ్రీన్ ఫీల్డ్ హైవేలు వంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలతో ఆర్ అండ్ బి శాఖ ముందుకు సాగుతోందని అన్నారు.
రాష్ట్ర అభివృద్ధిలో అతిపెద్ద డిపార్ట్మెంట్ ఆర్ అండ్ బీ అని కొనియాడారు. ఉద్యోగులందరూ అత్యంత నిబద్ధత, నిజాయతీ, బాధ్యతతో పనిచేసి శాఖకు మంచిపేరు తీసుకురావాలన్నారు. తమ శాఖ ఇంజనీర్లు, ఉద్యోగులు తనకు కుటుంబ సభ్యులతో సమానమని పేర్కొన్నారు. అనంతరం ఉద్యోగులతో కలిసి మంత్రి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఎన్సీలు మోహన్ నాయక్, జయ భారతి, సీఈలు రాజేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కిషన్ రావు, బి.వి రావు, లింగారెడ్డి, వసంత్ నాయక్, నర్సింగ్ రావు, ఆర్ అండ్ బి ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
