
న్యూఢిల్లీ, వెలుగు: దేశంలో భూగర్భజలాల పథకాల్లో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. ఉపరితల జలాల పథకాల్లో మూడో స్థానంలో చోటు దక్కించుకుంది. చిన్ననీటి పారుదల (మైనర్ ఇరిగేషన్) పథకాలకు సంబంధించిన ఆరో రిపోర్టును కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసింది. ఈ రిపోర్టులో దేశవ్యాప్తంగా మొత్తం 2.31 కోట్ల చిన్ననీటి పారుదల పథకాలు ఉన్నాయని జలశక్తి శాఖ పేర్కొంది. అందులో 2.19 కోట్లు (94.8 శాతం) గ్రౌండ్ వాటర్ పథకాలు, 10.21 లక్షల (5.2 శాతం) ఉపరితల జలాల స్కీంలు ఉన్నాయని వెల్లడించింది.
ఇక దేశంలో అత్యధిక మైనర్ ఇరిగేషన్ స్కీంలు ఉన్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచిందని తెలిపింది. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ ఉన్నాయని వివరించింది. అలాగే, ఉపరితల జలాల పథకాల్లో మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్ వరుసగా మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. గ్రౌండ్ వాటర్ స్కీంలలో బావులు, చేతి బోర్లు, మధ్యస్థ బోర్లు, లోతైన బోర్లు.. ఉపరితల జలాల స్కీమ్స్ లో ప్రవాహ, లిఫ్ట్ స్కీంలను పరిగణలోకి తీసుకున్నామని కేంద్రం వివరించింది. కాగా, గ్రౌండ్ వాటర్ స్కీంలు తెలంగాణలో తగ్గుముఖం పట్టాయని పేర్కొంది.