ఇన్​ఫ్లూయెంజా కేసుల్లో ఐదోస్థానంలో రాష్ట్రం

ఇన్​ఫ్లూయెంజా కేసుల్లో ఐదోస్థానంలో రాష్ట్రం

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ఇన్‌‌ఫ్లూయెంజా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సర్కార్ అలర్ట్ అయింది. రాష్ట్రంలో పరిస్థితిపై ఆరోగ్యశాఖ అధికారులు, డాక్టర్లతో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌‌రావు బుధవారం రివ్యూ చేశారు.  దేశవ్యాప్తంగా ఇన్‌‌ఫ్లూయెంజా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఐదో స్థానంలో ఉందని వైద్యశాఖ ఉన్నతాధికారులు మంత్రికి వివరించారు. ఈ ఏడాది జనవరి ఫస్ట్ నుంచి ఇప్పటివరకు తమిళనాడులో అత్యధికంగా 887 కేసులు నమోదవగా, 744 కేసులతో కర్ణాటక రెండో స్థానంలో ఉందన్నారు. ఢిల్లీ(352), యూపీ(223) తర్వాత 205 కేసులతో తెలంగాణ ఐదో స్థానంలో ఉందని తెలిపారు. జ్వరం, జలుబు, ఇతర ఫ్లూ లక్షణాలతో ఓపీకి వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని, ఇందులో పిల్లలే ఎక్కువగా ఉంటున్నారని డాక్టర్లు మంత్రికి వివరించారు. పిల్లలకు మాత్రమే హాస్పిటల్‌‌ అడ్మిషన్ అవసరం అవుతోందని, పెద్దవాళ్లు ఓపీ ట్రీట్‌‌మెంట్‌‌తోనే కోలుకుంటున్నారని చెప్పారు. పిల్లల్లో వ్యాధి తీవ్రత తక్కువగానే ఉంటోందని, ముందు జాగ్రత్తగా ఆస్పత్రుల్లో అడ్మిట్ చేసుకుని ట్రీట్‌‌మెంట్ అందిస్తున్నామని తెలిపారు. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ హాస్పిటల్స్​లో ప్రత్యేకంగా ఫీవర్ ఓపీ కౌంటర్లు పెట్టాలని ఆఫీసర్లకు హెల్త్ సెక్రటరీ సూచించారు. ఈ జబ్బు ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే ప్రమాదం ఉందని పిల్లల తల్లిదండ్రులకు వివరించి, జాగ్రత్తలు తీసుకునేలా వారిని అప్రమత్తం చేయాలని డాక్టర్లకు నిర్దేశించారు. ఇన్​ఫ్లూయెంజా కేసుల గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి హరీశ్‌‌రావు అన్నారు. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఉంటే దగ్గరలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్‌‌కు వెళ్లి చూపించుకోవాలని ఆయన సూచించారు. డాక్టర్ల సూచన లేకుండా యాంటీ బయోటిక్స్​, స్టెరాయిడ్స్‌‌, పెయిన్ కిల్లర్స్ వినియోగించొద్దని కోరారు. ఫ్లూ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పిల్లల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని వీసీ ద్వారా డాక్టర్లకు మంత్రి నిర్దేశించారు. 

సివియర్ అక్యూట్​ రెస్పిరేటరీ ఇల్‌‌నెస్ సర్వైలెన్స్‌‌

రాష్ట్రంలో గతేడాది డిసెంబరులో అత్యధికంగా 970 ఇన్‌‌ఫ్లూయెంజా కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు మంత్రికి తెలిపారు.  జనవరిలో 133, ఫిబ్రవరిలో 65, మార్చి నెలలో ఇప్పటివరకు 7 కేసులు బయటపడ్డాయని చెప్పారు. ఇప్పుడు మళ్లీ కేసులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయన్నారు.  ఈ నేపథ్యంలో సారి(సివియర్ అక్యూట్​ రెస్పిరేటరీ ఇల్‌‌నెస్‌‌) సర్వైలెన్స్​ను పటిష్టం చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది జనవరిలో 13,441, ఫిబ్రవరిలో 11,624, మార్చిలో ఇప్పటివరకు 1996 ‘సారి’ కేసులను గుర్తించారు. ఇవి కూడా ఇన్‌‌ఫ్లూయెంజా ట్రెండ్‌‌ను గుర్తించేందుకు ఉపయోగపడుతాయని ఆఫీసర్లు చెబుతున్నారు.