రిజిస్ట్రేషన్ లో స్లాట్ విధానం వద్దు.. ఉత్తుత్తి కారణాలతో వాయిదా వేస్తున్నరు: రియల్టర్ల డిమాండ్

రిజిస్ట్రేషన్ లో స్లాట్ విధానం వద్దు.. ఉత్తుత్తి కారణాలతో వాయిదా వేస్తున్నరు: రియల్టర్ల డిమాండ్
  • రోజుల తరబడి  తిరగాల్సి వస్తోంది
  • తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ డిమాండ్

ఘట్​కేసర్, వెలుగు: కొత్తగా ప్రవేశపెట్టిన స్లాట్‌‌‌‌‌‌‌‌ఆధారిత రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ విధానం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ విమర్శించింది. వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలని మంగళవారం మేడ్చల్ జిల్లా నారపల్లి సబ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌ ఆఫీసు వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్​అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ అపాయింట్​మెంట్ తీసుకుని నిర్దిష్ట రోజున రిజిస్ట్రేషన్​కోసం వెళ్తే చివరి క్షణంలో రద్దు చేస్తున్నారన్నారు. 

దీంతో రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. ఇలా ప్రతిరోజూ 20 నుంచి 30 వరకు రిజిస్ట్రేషన్లు వివిధ సాకులతో రద్దు చేస్తున్నారన్నారు. అడిగితే సర్వర్ సమస్య అని, స్కానింగ్ లోపాలున్నాయని, టెక్నికల్​ఇష్యూస్​, సిబ్బంది కొరత ఉందని చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దగ్గర ఉన్న నారపల్లి సబ్​రిజిస్ట్రార్ ఆఫీసులో మౌలిక వసతులు కూడా లేవన్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు రేగు శ్రీశైలం, శ్రీనివాస్, పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రజలు పాల్గొన్నారు.