వడ్డీల భారాన్ని తగ్గిస్తున్నాం..11.50 శాతం ఉన్న వడ్డీని 8 శాతానికి తెచ్చాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

వడ్డీల భారాన్ని తగ్గిస్తున్నాం..11.50 శాతం ఉన్న వడ్డీని 8 శాతానికి తెచ్చాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ముదిగొండ, వెలుగు : రాష్ట్ర బడ్జెట్​లో నెలకు 11 వేల కోట్ల వడ్డీలు కడుతున్నామని, గత పాలకులు చేసిన 26 వేల కోట్ల అప్పుకు 11.50 శాతం ఉన్న వడ్డీని 8 శాతానికి తగ్గించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం ముదిగొండ మండల బీఆర్ఎస్ లీడర్లంతా మొత్తం డిప్యూటీ సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం క్యాబినెట్ పనిచేస్తున్న తీరును చూసి రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు.

 ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి జిల్లా నాయకులే కాదు.. ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరడానికి వస్తున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన ఏడున్నర లక్షల కోట్ల అప్పులు ఏమయ్యాయని ప్రశ్నిస్తే.. పదేండ్లు పరిపాలించిన నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు వస్తాయని భావించి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తుచేశారు. పదేండ్లు తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయ్యిందన్నారు.

 రాష్ర్ట ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారని, వారి కుటుంబ అవసరాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. అప్పుల భారం నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు ప్రధానమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రిని పలుమార్లు కలిశామని చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఉప్పు, పప్పు ఏది కొనుగోలు చేసినా పన్ను చెల్లిస్తున్నారని, ఆ పన్నులతోనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామన్నారు. 

రాష్ట్ర ఖజానాలోని ప్రతి పైసాకు అధికారులు జవాబుదారీగా ఉండాలని సూచించారు.  ఉద్యోగులు సకల జనుల సమ్మె చేసి ప్రత్యేక రాష్ట్రం కోసం కృషి చేస్తే గత పాలకులు ఉద్యోగులకు సంబంధించిన రూ.15 వేల కోట్ల బకాయిలు చెల్లించలేదని వెల్లడించారు. తమప్రభుత్వం రాగానే నెలకు రూ.700 కోట్ల చొప్పున ఉద్యోగుల బకాయిలు చెల్లించుకుంటూ వస్తున్నామని వివరించారు. 

పదేండ్లలో రాష్ట్రంలో ఒక బడి, రోడ్డు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ప్రజలకు దక్కలేదన్నారు. గోదావరిపై లక్ష కోట్లు అప్పు తెచ్చి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కోటేశ్వరరావు, కార్పొరేషన్ చైర్మన్లు నాగేశ్వరరావు, సత్యనారాయణ పాల్గొన్నారు.