గిరిజన సంక్షేమ శాఖకు రూ.672 కోట్లు విడుదల

గిరిజన సంక్షేమ శాఖకు రూ.672 కోట్లు విడుదల

హైదరాబాద్, వెలుగు: గిరిజన సంక్షేమ శాఖకు ప్రభుత్వం రూ.672 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ ఉత్తర్వులు జారీ చేశారు. 2026–27 ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికానికి సంబంధించిన నిధులుగా వీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ నిధులతో గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు పలు సంక్షేమ పథకాల అమలుకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందిర గిరి జల వికాసం పథకానికి రూ.150 కోట్లు కేటాయించారు.

పోడు రైతులకు వంద శాతం సబ్సిడీపై సోలార్ పంప్‌‌‌‌సెట్లు, పండ్ల మొక్కలు అందించనున్నారు. దీంతో విద్యుత్ కోతలు, మోటార్లు కాలిపోవడం వంటి సమస్యలు తగ్గి ఏడాదికి రెండు పంటలు సాగు చేసే అవకాశం కలుగనుంది. రాజీవ్ యువ వికాసం పథకానికి రూ.327.50 కోట్లు కేటాయించగా, నిరుద్యోగ గిరిజన యువతకు రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు. ఐటీడీఏలకు రూ.18.75 కోట్లు, ఎస్టీ ఆవాసాల్లో విద్యుత్ సౌకర్యాల కోసం రూ.12.56 కోట్లు కేటాయించారు.