
తల్లి తిట్టిందని.. తండ్రి కొట్టాడని.. భర్త మందలించాడని.. భార్య కాపురానికి రాలేదని.. ఇలా కుటుంబాల్లో చిన్నచిన్న మనస్పర్థల కారణంగా ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య ఏటా పెరుగుతున్నది. ఫ్యామిలీ ఇష్యూస్తోనే రాష్ట్రంలో అత్యధిక ఆత్మహత్యలు జరుగుతున్నాయని ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఆరోగ్య సమస్యలు, వ్యసనాలు ఉన్నాయి. 2022-–23 మధ్య రాష్ట్రంలో 10,580 మంది సూసైడ్ చేసుకోగా, వీరిలో అత్యధికంగా 4,680 మంది (44 శాతం) కుటుంబ కలహాల వల్లే చనిపోయారు.
ఈ విషయంలో దేశంలోనే తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. ఫ్యామిలీ ఇష్యూస్ తర్వాతి స్థానంలో ఆరోగ్య సమస్యలు, లిక్కర్, డ్రగ్స్వ్యసనం, వివాహ సంబంధ సమస్యలు, ప్రేమ వ్యవహారాలు ఉండగా, ఆ తర్వాత స్థానంలో అప్పులు, ఆర్థిక నష్టాలు ఉన్నాయి. ఇక ఆత్మహత్యలు చేసుకునేవారిలో అత్యధికంగా 27.3 శాతంతో రోజువారీ కూలీలు ఉండగా, ఆ తర్వాతి స్థానంలో 14.5 శాతంతో గృహిణిలు ఉండడం గమనార్హం.
కుటుంబ కలహాల్లో ఎక్కువగా మహిళలే బలి..
దేశవ్యాప్తంగా కుటుంబ కలహాల వల్ల అత్యధికంగా 31.9 శాతం మంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో ఇది 44 శాతంగా ఉంది. నేటితరం పిల్లలు భావోద్వేగాలను నియంత్రించుకోవడంలేదని, తల్లిదండ్రులు మందలించినా, కావాలనుకున్నది దక్కకపోయినా, పరీక్షల్లో ఫెయిల్అయినా సూసైడ్ చేసుకుంటున్నారని సైకియాట్రిస్టులు చెప్తున్నారు. చాలా మంది పిల్లలు బైక్, సెల్ఫోన్ కొనివ్వలేదనే కారణంతో చనిపోతున్నారని గుర్తుచేస్తున్నారు.
అందుకు తగినట్లే దేశవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారిలో విద్యార్థులు, యూత్16 శాతానికి పైగా ఉంటున్నారు. పురుషుల సూసైడ్‌లకు చాలావరకు అప్పులు, ఆర్థిక సమస్యలు కారణమవుతుండగా, భార్యాభర్తల మధ్య కలహాలు, కట్నం కోసం వేధింపులు మహిళలను బలిగొంటున్నాయి. ముఖ్యంగా భర్త, అత్తమామలతో గొడవల కారణంగా క్షణికావేశంలో చనిపోతున్న గృహిణుల సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. దేశవ్యాప్తంగా మొత్తం ఆత్మహత్యల్లో వీరి వాటా14.5 శాతంగా ఉంది. కుటుంబ కలహాల వల్ల మహిళలు తాము చనిపోవడంతో పాటు పిల్లల ప్రాణాలు కూడా తీస్తున్నట్లు ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి.
రోజూవారీ కూలీలే ఎక్కువ..
ఆత్మహత్యలు అనగానే ముందుగా రైతులు గుర్తుకువస్తారు. అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో ఎక్కువమంది రైతులు చనిపోతుంటారని భావిస్తుంటాం. కానీ ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్ ఈ అంచనాలను పటాపంచలు చేసింది. దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నవారిలో అత్యధికంగా రోజూవారీ కూలీలు ఉంటున్నారు. మొత్తం సూసైడ్స్‌లో వీరి వాటా 27.5శాతంగా ఉంది. ఆతర్వాతి స్థానంలో గృహిణిలు(14.5), వ్యాపారులు (11.8), ఉద్యోగులు (9.6), నిరుద్యోగులు (8.3), విద్యార్థులు (8.1) ఉండగా, చివర్లో కౌలు రైతులు(6.3) ఉన్నారు. రోజూవారీ కూలీల ఆదాయం తక్కువగా ఉండడంతో ఆర్థిక సమస్యలు, అప్పులు పెరగడం, కుటుంబాలు గడవకపోవడం, అవిద్య, వ్యసనాలు తదితర కారణాల వల్ల వీరిలో ఆత్మహత్యలు ఎక్కు వ అని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.
అలాగే ఆత్మహత్యకు కారణాల్లో మొదటి కారణం కుటుంబం కలహాలు కాగా, ఆ తర్వాతి స్థానంలో అనారోగ్య సమస్యలు(19 శాతం) ఉంటున్నాయి. ఎంతకూ నయం కాని మొండిరోగాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్వాలిటీ వైద్యం అందకపోవడం, ప్రైవేట్‌లో చికిత్స చేయించుకునే స్థోమత లేకపోవడంతో రోగులు, వారి కుటుంబ సభ్యులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఇక డ్రగ్స్, మద్యపానం వ్యసనం కారణంగా 7 శాతం మంది, ప్రేమ వ్యవహారాల్లో 5.3 శాతం, లవ్ ఇష్యూస్ తో 4.7 శాతం మంది చనిపోతుండగా, వీరిలో యూత్ ఎక్కువగా ఉంటున్నారు. ఇక ఆర్థిక సమస్యలతో 3.8 శాతం మంది ప్రాణాలు తీసుకుంటుండగా, వీరిలో ఉద్యోగులు, రైతులు ఎక్కువ అని ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి.