
రెరా చైర్మన్ ఐదు రియల్ ఎస్టేట్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. రెరా నిబంధనలు పాటించని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై చర్యలు తప్పవని తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ హెచ్చరిచారు. ప్రీ లాంచింగ్ పేరుతో ప్లాట్ల అమ్మకాలు చేయడం, అనుమతి లేకుండా అదనపు నిర్మాణాలు చేపట్టడం, రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ప్లాట్ల విక్రయాలు చేస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలకు నోటీసులు జారీ చేశారు.
నోటీసులు అందుకున్న వాటిలో.. భువన తేజ ఇన్ఫ్రా, రాధే గ్రూప్ రియల్ ఎస్టేట్స్, టీఎంఆర్, ఓం శ్రీ బిల్డర్లు డెవలపర్స్, సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీలు ఉన్నాయి. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
రేరా అంటే..
రేరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్) యాక్ట్- 2016 దీన్ని నిర్వచించింది. ఇది ఇంటి కొనుగోలుదారులకు భద్రత కల్పించడంతో పాటు రియల్ ఎస్టేట్ పెట్టుబడులను కూడా ప్రోత్సహిస్తుంది. ఈ చట్టానికి సంబంధించిన బిల్లును 2016, మార్చి 10న రాజ్యసభ ఆమోదించింది. RERA చట్టం 2016, మే 1 నుంచి అమల్లోకి వచ్చింది.
రెరా చట్టం ప్రకారం.. కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల డబ్బులో కనీసం 70 శాతాన్ని ప్రత్యేక అకౌంట్‌లో ఉంచుతారు. నిర్మాణం, భూమి సంబంధిత ఖర్చులకు మాత్రమే ఈ డబ్బును బిల్డర్లకు కేటాయిస్తారు. సేల్ అగ్రిమెంట్‌పై సంతకం చేసే ముందు.. డెవలపర్లు, బిల్డర్లు ఆస్తి ఖర్చులో 10% కంటే ఎక్కువ మొత్తాన్ని అడ్వాన్స్ పేమెంట్‌గా అడిగే అవకాశం లేదు.
బిల్డర్లు తాము చేపట్టే అన్ని ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను సమర్పించాలి. కొనుగోలుదారుల అనుమతి లేకుండా బిల్డర్లు ప్లాన్‌లలో ఎలాంటి మార్పులు చేయకూడదు.
రేరా నిబంధనల ప్రకారం డెవలపర్లు సూపర్ బిల్ట్ అప్ ఏరియాపై కాకుండా కార్పెట్ ఏరియా ఆధారంగానే ప్రాపర్టీలను అమ్మాలి. ఒకవేళ ప్రాజెక్ట్ ఆలస్యమైతే, కొనుగోలుదారులు పెట్టుబడి పెట్టిన మొత్తం డబ్బును తిరిగి పొందేందుకు అర్హులు. లేదంటే వారు పెట్టుబడి పెట్టే ఆప్షన్‌ను ఎంచుకుని, తమ డబ్బుపై నెలవారీ పెట్టుబడి ఫలాలు పొందవచ్చు.
కొనుగోలుదారులు ఎదుర్కొన్న ఏదైనా సమస్యను, ప్రాపర్టీ కొనుగోలు చేసిన 5 సంవత్సరాలలోపు బిల్డర్ తప్పకుండా సరిదిద్దాలి. దీనిపై ఫిర్యాదు చేసిన 30 రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలనే నిబంధన ఉంది.
రిజిస్ట్రేషన్ చేయకుండా రెగ్యులేటర్ ప్లాట్‌ను అడ్వర్టైజ్ చేయడం, అమ్మడం, నిర్మించడం, పెట్టుబడి పెట్టడం లేదా బుక్ చేయడం కుదరదు. రిజిస్ట్రేషన్ తర్వాత పెట్టుబడులకు సంబంధించిన అన్ని ప్రకటనల్లో రెరా అందించిన ప్రత్యేక ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉండాలి.