
- కరెంట్ కనెక్షన్లతో ప్రాపర్టీలను
- లింక్ చేసి పట్టేసిన అధికారులు
- మూడేండ్ల ట్యాక్స్ వర్తింపజేస్తూ ఓనర్లకు నోటీసులు
- ఏడాదికి రూ.200 కోట్లకుపైగా ఆదాయం
హైదరాబాద్ సిటీ, వెలుగు : రెసిడెన్షియల్పన్ను కడుతున్న కమర్షియల్ ప్రాపర్టీదారుల అక్రమాలకు బల్దియా చెక్పెట్టబోతున్నది. నగరంలో కమర్షియల్ కరెంట్కనెక్షన్లు తీసుకుని చాలా కాలంగా రెసిడెన్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్న పలువురిని గుర్తించిన బల్దియా వారి నుంచి అసలైన పన్ను రాబట్టేందుకు రంగం సిద్ధం చేసింది.
కడుతున్నది రెండున్నర లక్షలే..
జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరు అయిన ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపులకు సిటీలోని 30 సర్కిళ్లలో కలిపి సుమారు19.50 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నెంబర్లున్నాయి. వీటిలో రెండు లక్షల ఆస్తులకు మాత్రమే కమర్షియల్ ట్యాక్స్ చెల్లిస్తుండగా, మిగిలిన ఆస్తులకు రెసిడెన్షియల్ ట్యాక్స్ ను కడుతున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న అనుమానంతో గత సంవత్సరం జులై నెలాఖరు నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్న ఆస్తులపై జీహెచ్ఎంసీ నియో జియో సంస్థలతో జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వే(జీఐఎస్) నిర్వహించింది. ఈ సర్వేలో అనేక రకాల ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి.
అడిషనల్ కమిషనర్ స్పెషల్ మీటింగ్
అడిషనల్కమిషనర్ (ఐటీ, రెవెన్యూ) అనురాగ్ జయంతి మంగళవారం టీజీపీఎస్ పీ డీసీఎల్, జీహెచ్ఎంసీ రెవెన్యూ వింగ్ అధికారులతో మంగళవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఎల్బీనగర్ జోన్ లో 9,761 ప్రాపర్టీలు, చార్మినార్ లో 26,056, ఖైరతాబాద్ లో 22,514, సికింద్రాబాద్ లో 22,005, కూకట్‌పల్లి జోన్ లో 7,260, శేరిలింగంపల్లి జోన్ లో 9,342 ఆస్తుల వివరాలను విద్యుత్ శాఖ డేటాతో లింక్ చేసినట్లు అధికారులు తెలిపారు. వీరి నుంచి కమర్షియల్ ట్యాక్స్ వసూల్ చేయనున్నారు. దాదాపు బల్దియాకు ఏడాదికి రూ.200 కోట్లకుపైగా ఆదాయం పెరిగే అవకాశముంది.
తక్కువ కడ్తున్న 96,938 మంది..
గ్రేటర్లోని 19.50 లక్షల ప్రాపర్టీల్లో సుమారు 96,938 ఆస్తులను నాన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీలుగా జీహెచ్ఎంసీ గుర్తించింది. కానీ, ఈ ఆస్తులన్నీ రెసిడెన్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ మాత్రమే చెల్లిస్తున్నాయి. ఈ విషయాన్ని మరింత టెక్నికల్ గా నిర్ధారించుకునేందుకు కొత్త ప్లాన్అమలు చేసింది. 96,938 మంది ఆస్తుల డేటాను వారు వినియోగిస్తున్న కరెంట్మీటర్ల కనెక్షన్లతో అనుసంధానం చేసి చెక్చేయాలని డిసైడ్చేసింది.
ఫైనల్వెరిఫికేషన్తర్వాత నిజమేనని తేలితే అలాంటి ఆస్తులకు ప్రస్తుతం చెల్లిస్తున్న రెసిడెన్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ ను సవరించనున్నారు. తర్వాత మూడేండ్ల కమర్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ ను వర్తింపజేస్తూ యజమానులకు నోటీసులు జారీ చేయనున్నారు. డేటాలను అనుసంధానం చేసే బాధ్యతను మెస్సర్స్ సోల్ పేజ్ అనే సంస్థకు అప్పగించినట్లు సమాచారం. ఈ ప్రక్రియతో జీహెచ్ఎంసీకి ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా భారీగా ఆదాయం పెరగుతుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు.