‘పీఆర్‌‌‌‌’లోకి రెవెన్యూ ఉద్యోగులు 

‘పీఆర్‌‌‌‌’లోకి రెవెన్యూ ఉద్యోగులు 

కొందరు వ్యవసాయ శాఖలోకి కూడా..
భూ రికార్డుల బాధ్యతలు ఆర్డీవో లేదా జేసీలకు అప్పగింత!
అధికార వర్గాల్లో చర్చ

రెవెన్యూ ఉద్యోగులను ఇతర శాఖల్లో విలీనం చేయడం దాదాపు ఖాయమైపోయింది. వీఆర్‌‌‌‌ఏలు మొదలు తహసీల్దార్ల వరకు రెవెన్యూ ఉద్యోగులందరినీ పంచాయతీరాజ్‌‌‌‌, వ్యవసాయ శాఖల్లో కలిపేయాలని సర్కార్‌‌‌‌ భావిస్తున్నట్లు అధికార వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. సీఎం కేసీఆర్‌‌‌‌ ఆదేశాలతో ఇప్పటికే కొత్త రెవెన్యూ చట్టంపై కసరత్తు పూర్తిచేసిన ఉన్నతాధికారులు.. కీలకమైన భూ రికార్డుల నిర్వహణ బాధ్యతల నుంచి వీఆర్వోలు, తహసీల్దార్లను తప్పిస్తూ చట్ట సవరణ చేసినట్లు సమాచారం. ఈ బాధ్యతలను ఆర్డీవో లేదా జేసీలకు అప్పగిస్తూ మార్పులు చేసినట్లు తెలిసింది.

డిజిటలైజేషన్​ పూర్తయిందనీ..

భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ఇప్పటికే 90 శాతం రికార్డుల డిజిటలైజేషన్ పూర్తయినట్లు పలుమార్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. పార్ట్‌‌‌‌ బీలో చేర్చిన 10 శాతం భూములకే కోర్టు వివాదాలు, ఇతర అభ్యంతరాలతో పాస్‌‌‌‌ బుక్కుల జారీ నిలిచిపోయింది. రైతులకు కొత్త పాస్‌‌‌‌ బుక్కులు జారీ చేసేకంటే ముందే రైతుల బయోమెట్రిక్‌‌‌‌ను కూడా తీసుకున్నారు. దీంతో భూ రికార్డులన్నీ రైతుల బయోమెట్రిక్‌‌‌‌తో అనుసంధానమయ్యాయని, ఇక మీదట గతంలోలాగా ఒకరి భూమిని మరొకరి పేరిట పట్టా చేయడానికి వీలుకాదని ప్రభుత్వం చెబుతోంది. భూముల క్రయవిక్రయాల సందర్భంలో భూమి యజమాని బయోమెట్రిక్‌‌‌‌ సరిపోలితేనే మ్యుటేషన్‌‌‌‌ జరగనుంది. అంతేగాక పహణీల్లో అనుభవదారు కాలమ్‌‌‌‌ను తీసేయడం, గతంలోలాగా ఏటా అప్‌‌‌‌డేట్‌‌‌‌ చేసే పనిలేకపోవడంతో వీఆర్వో, వీఆర్‌‌‌‌ఏలాంటి గ్రౌండ్​ లెవల్​ సిబ్బంది అవసరం లేదని సర్కార్‌‌‌‌ భావిస్తున్నట్లు తెలిసింది. పార్ట్‌‌‌‌ బీలో చేర్చిన భూముల వివాదాలు ఏమైనా ఉంటే ఇక మీదట ఆర్డీవో దగ్గరే పరిష్కరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

పీఆర్‌‌‌‌ పరిధిలోకి రెవెన్యూ ఉద్యోగులు

పింఛన్ల పంపిణీ, రైతు బంధు, హరితహారం, మిషన్‌‌‌‌ భగీరథ, పారిశుద్ధ్య నిర్వహణ తదితర పనులకు సిబ్బంది కొరత ఉంది. ఈ పనులకు వీఆర్​ఏలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలోని 24,035 మంది వీఆర్‌‌‌‌ఏలు ఉండగా.. వీరిలో పెద్దమొత్తంలో వీఆర్​ఏలను పీఆర్‌ శాఖ పరిధిలోకి తీసుకురావాలని, మరికొందరిని వ్యవసాయ శాఖ అవసరాలకూ వాడుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇక 5,088 మంది వీఆర్వోలకు భూరికార్డుల నిర్వహణ కాకుండా ఉన్న మిగతా బాధ్యతలను యథావిధిగా కొనసాగిస్తూ.. వారికి ప్రభుత్వ పథకాల అమలును అప్పగించాలనే చర్చ కూడా ప్రభుత్వ ప్రతిపాదనల్లో ఉన్నట్లు తెలిసింది. పింఛన్ల పంపిణీ, రైతుబంధు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల పర్యవేక్షణ బాధ్యతను వీరికి అప్పగించనున్నట్లు సమాచారం. అలాగే తహసీల్దార్లను జడ్పీ సీఈవోల పరిధిలోకి తీసుకురావడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు పర్యవేక్షణ, గతంలోలాగే ధ్రువీకరణ పత్రాల జారీకి వారిని పరిమితం చేయనున్నట్లు తెలిసింది.

రెవెన్యూ సంఘాల్లో ఆధిపత్య పోరు

కొత్త రెవెన్యూ చట్టం ప్రతిపాదన రెవెన్యూ సంఘాల్లో ఆధిపత్య పోరుకు కారణమైంది. కొత్త చట్టాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతామని సీఎం కేసీఆర్‌‌‌‌ స్పష్టం చేసిన నేపథ్యంలో తమ పరిస్థితి ఏమిటని, ప్రమోషన్లు, సర్వీస్‌‌‌‌ రూల్స్‌‌‌‌ ఎలా ఉంటాయో ప్రకటించాలని రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్‌‌‌‌ చేస్తున్నారు. గతంలో పలు బహిరంగ సభల్లో, అసెంబ్లీలో రెవెన్యూ ఉద్యోగులపై సీఎం చేసిన ప్రకటనలతో వారిలో అప్పుడే ఒకింత ఆందోళన మొదలైంది. ఈ ప్రకటనలపై గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం ఇప్పటికే పలుమార్లు ధిక్కార స్వరం వినిపించింది. మేధావులు, రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలతో సదస్సులు నిర్వహించడంతోపాటు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. మిగతా రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఈ విషయంలో మౌనం వహించడం ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆ సంఘాలూ ఆందోళన బాట పట్టాయి. కొన్ని సంఘాలు ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం ప్రయత్నిస్తున్నాయని, కలిసి నడువాల్సింది పోయి విడివిడిగా వెళ్లడం ఏమిటని ఉద్యోగుల నుంచి విమర్శలొస్తున్నాయి.

‘రెవెన్యూ’లో మార్పులు చేయాలె..ప్లానింగ్‌‌‌‌ బోర్డ్‌‌‌‌ వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ వినోద్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రెవెన్యూ వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్లానింగ్‌‌‌‌ బోర్డ్‌‌‌‌ వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ బి.వినోద్‌‌‌‌ కుమార్‌‌‌‌ అన్నారు. బుధవారం తన క్యాంప్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో ఏనుగు నర్సింహారెడ్డి రచించిన ‘తెలుగు రాష్ట్రాల రెవెన్యూ వ్యవస్థ -నిన్న, నేడు, రేపు’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. రెవెన్యూ వ్యవస్థపై చర్చ జరుగుతున్న తరుణంలో ఈ పుస్తకం ఎంతో అవసరమని అన్నారు. రెవెన్యూ అధికారిగా నర్సింహా రెడ్డి తన అనుభవాలతో ఈ పుస్తకాన్ని రాశారని కొనియాడారు. భూమి శిస్తు వసూలు నుంచి సాధారణ పరిపాలన శాఖగా మారిన రెవెన్యూ శాఖ చరిత్రను, ఇప్పుడు ఎదుర్కొంటున్న విమర్శలకు కారణాలను ఈ పుస్తకం వివరిస్తుందని వినోద్​కుమార్​చెప్పారు. కార్యక్రమంలో బీసీ కమిషన్‌‌‌‌ సభ్యుడు జూలూరి గౌరీశంకర్‌‌‌‌, బీసీ స్టడీ సర్కిల్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ ఎన్‌‌‌‌. బాలాచారి పాల్గొన్నారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి