
మెదక్ టౌన్, వెలుగు : తెలంగాణ రైజింగ్ - 2047 సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రూపకల్పన కోసం ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్-- 2047 సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని తెలిపారు. దేశ స్వాతంత్ర్యానికి వంద ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుంచి సలహాలు, సూచనలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం "తెలంగాణ రైజింగ్ -- 2047 " సిటిజన్ సర్వేను చేపట్టిందని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ సర్వే ఈ నెల 25వ తేదీతో ముగుస్తుందని, ఈ సర్వే ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్నందున www.telangana.gov.in /telanganarising సైట్ను సందర్శించి తమ అమూల్యమైన సలహాలు, సూచనలు అందించాలని కలెక్టర్ కోరారు.
విత్తనాల పంపిణ
రేగోడ్ : ప్రభుత్వం అందించే విత్తన రాయితీ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం రేగోడు రైతు వేదికలో జాతీయ నూనె గింజల పథకం, జాతీయ ఆహారభద్రత పథకం కింద విత్తన పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కలెక్టర్ ప్రారంభించి, మాట్లాడారు. 93 శాతం రాయితీతో పొద్దు తిరుగుడు, 50 శాతం రాయితీతో శనగ విత్తనాలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. ఈ పథకం కింద విత్తనాలే కాకుండా క్రిమిసంహారక మందులు కూడా రాయితీపై అందిస్తుందని తెలిపారు.
అనంతరం డీఏవో దేవకుమార్ మాట్లాడుతూ బ్లాక్ లెవెల్ డిమాన్స్ట్రేషన్ కోసం గజ్వాడ గ్రామాన్ని ఎంపిక చేసినట్టు చెప్పారు. రైతులు పత్తిని సీసీఐకి మద్దతు ధరకు అమ్మాలంటే ముందుగా ప్రతి రైతు వ్యక్తిగతంగా 'కాపాస్ కిసాన్' మొబైల్ యాప్ లో స్లాట్ బుక్ చేసుకున్న తర్వాతే పత్తి మిల్లుకు వెళ్లి విక్రయించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మున్నూరు కిషన్, తహసీల్దార్ దత్త రెడ్డి, టెక్నికల్ ఏడీఏ విన్సెంట్ వినయ్, ఇన్చార్జి ఏడీఏ రాంప్రసాద్, ఏవో జావిద్, ఏఈవోలు భూలక్ష్మి, మహేశ్, కావ్య, సంరీన్ పాల్గొన్నారు.