స్వచ్ఛ గ్రామాలే టార్గెట్ గా.. రాష్ట్ర వ్యాప్తంగా 2.19 లక్షల వ్యక్తిగత మరుగు దొడ్లు మంజూరు

స్వచ్ఛ గ్రామాలే టార్గెట్ గా..  రాష్ట్ర వ్యాప్తంగా 2.19 లక్షల వ్యక్తిగత మరుగు దొడ్లు మంజూరు
  • ఏడాదిలోపే నిర్మాణాలు  పూర్తి చేసేలా ప్లాన్​
  •     ఒక్కో మరుగుదొడ్డికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం
  •     7 వేల సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
  •     మహిళా సంఘాల భవనాల వద్దే కమ్యూనిటీ టాయిలెట్లు
  •     ఒక్కో సామూహిక మరుగుదొడ్డికి రూ.3 లక్షల కేటాయింపు

హైదరాబాద్, వెలుగు:  పల్లెలను స్వచ్ఛంగా, ఆరోగ్య నిలయాలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. ‘స్వచ్ఛ భారత్ మిషన్-2’లో భాగంగా గ్రామాల్లో బహిరంగ మల విసర్జన పూర్తిగా నిర్మూలించేందుకు  ప్రతి ఇంట్లోనూ మరుగుదొడ్డి ఉండేలా కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 2.19 లక్షల ఇళ్లకు మరుగుదొడ్లు అవసరమని ప్రభుత్వం గుర్తించి మంజూరు ఇచ్చింది. 

ఏడాదిలోపే వందశాతం లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులకు డెడ్ లైన్ విధించింది.  ఇప్పటివరకు మరుగుదొడ్డి సౌకర్యం లేని 2,19,000 ఇళ్లకు రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. ఈ నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి మళ్లించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. కేవలం వ్యక్తిగత మరుగుదొడ్లతోపాటు గ్రామాల్లో సౌకర్యార్థం 7 వేల సామూహిక (కమ్యూనిటీ) మరుగుదొడ్లను నిర్మించాలని నిర్ణయించింది. ముఖ్యంగా మహిళా సంఘాల (వీఓ) భవనాల వద్ద వీటిని నిర్మించనున్నారు. ఒక్కో కమ్యూనిటీ టాయిలెట్ కు  ప్రభుత్వం రూ.3 లక్షలను కేటాయించింది.

ఇందిరమ్మ ఇళ్లకు ఎస్​బీఎం నిధులు.. 

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మరుగుదొడ్ల నిర్మాణం మరింత సులభం కానుంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మరుగుదొడ్డి నిర్మించుకోవడానికి స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్​బీఎం) నిధులను అనుసంధానం చేసింది. దీనివల్ల లబ్ధిదారులకు అదనపు ఆర్థిక భారం తగ్గనున్నది. ఇళ్ల నిర్మాణంతో పాటే మరుగుదొడ్లు కూడా పూర్తి కానున్నాయి. ఇది లబ్ధిదారులకు ఊరట కలిగించే అంశం. కాగా, అర్హులైన వారు మరుగుదొడ్డి నిర్మాణం కోసం ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. 

https://swachhbharatmission.ddws.gov.in వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లోకి వెళ్లి వివరాలు నమోదు చేయాలి. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఇబ్బందులు ఉన్నవారు తమ గ్రామ పంచాయతీ కార్యదర్శులను సంప్రదిస్తే దరఖాస్తు ప్రక్రియలో సహకరిస్తారని ఎస్​బీఎం అధికారులు వెల్లడించారు. సిటిజన్ కోటా కింద కూడా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవచ్చని పేర్కొన్నారు.