వీఆర్వో కారుణ్య నియామకాలకు సర్కార్‌‌‌‌‌‌‌‌ గ్రీన్ సిగ్నల్

వీఆర్వో కారుణ్య నియామకాలకు సర్కార్‌‌‌‌‌‌‌‌ గ్రీన్ సిగ్నల్
  • రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు 
  • 178 మందిని నియమించనున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడి

హైదరాబాద్, వెలుగు: వీఆర్వోల కారుణ్య నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అర్హత, క్వాలిఫికేషన్స్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను 2020లో రద్దు చేయగా, వీఆర్వోలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. ఈ క్రమంలో కొంత మంది వీఆర్వోలు మనోవేదనకు గురై అకాల మరణం చెందారు. 

ఆ కుటుంబాలకు న్యాయం చేసేలా కారుణ్య నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి తెలిపారు. ఎక్కడైతే ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో అక్కడ వీరి హోదాకు తగిన విధంగా సర్దుబాటు చేయాలని సూచించారు. 178 మందిని కారుణ్య నియామకాల కింద భర్తీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించి, ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించి ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. 

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం అమలు కోసం రెవెన్యూ శాఖను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మూడు నెలల్లోనే పోలీస్, స్టాఫ్ నర్స్, గురుకులాలు, సింగరేణి సంస్థలో 23 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. 63 అదనపు పోస్టులతో గ్రూప్–1, 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టామని గురువారం ఒక ప్రకటనలో మంత్రి వెల్లడించారు.