పెండింగ్ బిల్లులు ఇప్పించండి.. రాష్ట్ర గవర్నర్​ను కోరిన మాజీ సర్పంచ్​లు

పెండింగ్ బిల్లులు ఇప్పించండి.. రాష్ట్ర గవర్నర్​ను కోరిన మాజీ సర్పంచ్​లు

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల్లో పెండింగ్​లో ఉన్న బిల్లులు ఇప్పించాలని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్​ను రాష్ట్ర సర్పంచ్​ల సంఘం కోరింది. ఆదివారం రాజ్ భవన్ లో గవర్నర్ ను సంఘం అధ్యక్షులు లక్ష్మీ నర్సింహారెడ్డి, సుర్వి యాదయ్య గౌడ్ కలిసి వినతి పత్రం అందజేశారు. మాజీ సర్పంచ్ లకు పెండింగ్ లో ఉన్న బిల్లులు ఇప్పించేలా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 2019 నుంచి 2024 మధ్య సర్పంచ్​లుగా పనిచేసి అప్పటి ప్రభుత్వ ఆదేశాలమేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గుర్తుచేశారు. 

అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి నిధులు అందకపోయినా సొంత గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అప్పులు తెచ్చి, బంగారం తాకట్టు పెట్టి మరీ పనులు చేశామని చెప్పారు. గ్రామాల్లో వీధిలైట్ల నిర్వహణ, డ్రైనేజీ, పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక, వైకుంఠధామం, మనఊరు -మనబడి, పల్లె ప్రగతి, మిషన్ భగీరథ లాంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో చేపట్టామన్నారు. దీంతో ఐదేండ్ల టర్మ్​లో పంచాయతీలకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయని గుర్తుచేశారు. ఐదేండ్లలో బిల్లులు రిలీజ్ చేయకపోవటంతో చాలా మంది సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకున్నారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం.. సర్పంచ్​ల పదవీకాలం ముగిసి ఐదు నెలలు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు రిలీజ్ చేయలేదని గవర్నర్​కు తెలియజేశామన్నారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని, పెండింగ్ లో ఉన్న బిల్లులు విడుదల చేసేలా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తానని హామీ ఇచ్చారని సంఘం నేతలు తెలిపారు. ఉపాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, సుభాష్, అరుట్ల లక్ష్మీ ప్రసన్న రెడ్డి, గణేశ్, రాజేందర్, సముద్రాల రమేశ్ తదితరులు గవర్నర్​ను కలిసినవారిలో ఉన్నారు.