- ప్రమాదకరంగా రెండు కిలో మీటర్లు ప్రయాణించి స్కూల్‌కు
- నారాయణపేట జిల్లా మద్దూరు మండలం
- పెదిరిపహాడ్లో ఘటన
- స్కూల్ టైమ్‌కు బస్సు రాక స్టూడెంట్ల తిప్పలు
మద్దూరు, వెలుగు: ఆ ఊళ్లకు ఒకే ఒక్క బస్సు సర్వీసు ఉంది. అది కూడా టైంకు రాదు. దీంతో పిల్లలు బడికి వెళ్లాలంటే కాలినడకే గతి. అయితే, సోమవారం స్కూల్ టైం అవుతుండటంతో పిల్లలు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి బొలెరో వెహికల్‌కు వేలాడుతూ ప్రమాదకర ప్రయాణం చేశారు. దీన్ని కొందరు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
నారాయణపేట జిల్లా మద్దూరు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన 20 మంది, పెదిరిపహాడ్ తండాకు చెందిన నలుగురు పిల్లలు పెదిరిపహాడ్ జడ్పీహెచ్ఎస్లో వివిధ క్లాసుల్లో చదువుకుంటున్నారు. చెన్నారెడ్డిపల్లి నుంచి పెదిరిపహాడ్కు 3 కిలో మీటర్లు, పెదిరిపహాడ్ తండా నుంచి పెదిరిపహాడ్ గ్రామానికి 3 కిలో మీటర్ల దూరం ఉంది. ప్రతి రోజూ ఆర్టీసీ అధికారులు ఒక బస్సు సర్వీసును నడిపిస్తున్నారు. అయితే, ఆ బస్సు సమయానికి రావడం లేదు.
స్కూల్ టైమ్‌లో కాకుండా ఉదయం 10 గంటల తర్వాతే వస్తున్నది. సాయంత్రం కూడా అదే పరిస్థితి. దీంతో ఈ రెండు గ్రామాల బడి పిల్లలు కంసాన్పల్లి వై జంక్షన్ చౌరస్తా మీదుగా పెదిరిపహాడ్లోని జడ్పీహెచ్ఎస్కు రోజూ ఉదయం, సాయంత్రం కాలినడకన వస్తారు. సోమవారం ఉదయం కూడా రోజూ మాదిరిగానే పిల్లలు కంసాన్పల్లి చౌరస్తా వద్దకు కాలినడకన వచ్చారు. అప్పటికే స్కూల్ టైం దాటిపోవడంతో ప్రైవేట్ వాహనాలను లిఫ్ట్ అడిగారు.
ఈ క్రమంలో ఓ బొలెరో క్యాంపర్ డ్రైవర్ తన వాహనాన్ని ఆపి పిల్లలను ఎక్కించుకున్నాడు. కంసాన్పల్లి వై జంక్షన్ చౌరస్తా నుంచి పెదిరిపహాడ్ జడ్పీహెచ్ఎస్ వరకు పిల్లలు బంపర్‌పై వేలాడుతూ వెళ్లారు. దీంతో ఈ దృశ్యాన్ని చూసిన వెనకాల వచ్చే వాహనదారులు వీడియో తీశారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ విజయ్ కుమార్ ఘటనపై విచారణ చేస్తున్నారు.
