జపాన్ బడుల్లో జీవిత పాఠాలు.. చదువుతో పాటు విలువలు నేర్పుతరు

జపాన్ బడుల్లో జీవిత పాఠాలు.. చదువుతో పాటు విలువలు నేర్పుతరు
  • తొమ్మిదో తరగతి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్​ 
  • క్లాస్ రూమ్ క్లీనింగ్ బాధ్యత స్టూడెంట్లదే
  • ప్రాక్టికల్ లెర్నింగ్, క్రమశిక్షణకు పెద్దపీట
  • అక్కడి విద్యావిధానం బాగుందన్న స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ 
  • జపాన్​లో కొనసాగుతున్న తెలంగాణ టీచర్ల బృందం పర్యటన 
  • విద్యావిధానాన్ని పరిశీలిస్తున్న స్పెషల్ టీం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: స్కూల్ అంటే కేవలం పుస్తకాల్లో పాఠాలను చెప్పడమే కాదు.. విద్యార్థుల్లో విలువలను, సమాజం పట్ల, దేశంపట్ల  బాధ్యతను, క్రమశిక్షణను పెంపొందించే వేదిక అని జపాన్ విద్యావిధానం నిరూపిస్తున్నది. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఎక్స్చేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశం‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ  రాష్ట్రానికి చెందిన అధికారులు, టీచర్ల బృందం పర్యటిస్తోంది.

స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ నేతృత్వంలో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ బోర్డు డైరెక్టర్ లింగయ్య, టాస్ జాయింట్ డైరెక్టర్ రాజీవ్ సహా మొత్తం 40 మంది సభ్యుల డెలిగేషన్​.. మంగళవారం టోక్యోలోని పలు స్కూళ్లను సందర్శించి జపాన్​ విద్య తీరుతెన్నులను పరిశీలించింది. ఈ నెల12 వరకూ జపాన్​లో పర్యటించనున్నది. కాగా, ఈ టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా టోక్యోలోని జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ సెంటర్ (జేఐసీఈ) ను సందర్శించి, నేషనల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ పాలసీ రీసెర్చ్ (ఎన్ఐఈఆర్) అధికారులతో భేటీ అయ్యారు.

అలాగే, టోక్యోలోని ఇండియన్ ఎంబసీలో జపాన్ దేశంలో భారత రాయబారి నాగం మొహమ్మద్ మల్లిక్‌‌‌‌ను కలిసి.. విద్యాపరమైన సహకారంపై చర్చించారు. చియోడా కిండర్ గార్టెన్ స్కూల్, చియోడా ఎలిమెంటరీ స్కూల్, జూనియర్ హైస్కూల్ ఆఫ్ త్సుకూబా వర్సిటీని సందర్శించిన ఈ బృందం.. జపాన్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌‌‌‌లో ఆచరిస్తున్న పది కీలక విశేషాలను పరిశీలించారు. జపాన్​లో స్కూళ్లు, పిల్లలకు సంబంధించి ఫొటోలు, వీడియోలు తీయడంపై కఠిన నిబంధనలు ఉన్నట్టు తెలిపారు.

తొమ్మిదేండ్లు ఉచిత నిర్బంధ విద్య..
జపాన్‌‌లో తొమ్మిదేండ్లపాటు ఉచిత నిర్బంధ విద్య కొనసాగుతోంది. ఆరేండ్ల ప్రాథమిక విద్య (గ్రేడ్ 1-నుంచి 6), మూడేండ్ల లోయర్ సెకండరీ విద్య (గ్రేడ్ 7-నుంచి9) కలిపి మొత్తం తొమ్మిదేండ్ల పాటు ఉచితంగా  విద్య అందిస్తున్నారు. దీంతో ప్రతీ ఒక్కరికీ విద్య సమానంగా అందుతోంది. కేవలం అకడమిక్స్ మాత్రమే కాకుండా పిల్లల శారీరక, సామాజిక, భావోద్వేగ, నైతిక వికాసానికి పెద్దపీట వేస్తూ విద్యార్థుల సమగ్రాభివృద్ధికి అక్కడ ప్రాధాన్యమిస్తున్నారు.

అలాగే, విద్యార్థులు స్కూల్ కార్యకలాపాల్లో సమయపాలన , డిసిప్లెయిన్‌‌‌‌ పాటించడం, తోటివారిని గౌరవించడంలాంటి  క్రమశిక్షణ,- సమయపాలన పద్ధతులు పాటిస్తున్నారు. బడుల్లో పాఠాలు ప్లాన్ చేయడానికి, క్లాస్‌‌రూమ్ టీచింగ్‌‌‌‌ను అబ్జర్వ్ చేయడానికి టీచర్లు కలెక్టివ్‌‌‌‌గా వర్క్ చేసే ‘లెసన్ స్టడీ’ విధానం టీచింగ్ క్వాలిటీని నిరంతరం మెరుగుపరుస్తున్నది.

బడుల్లో నైతిక విద్య.. 
బడుల్లో విద్యార్థులకు గౌరవం, నిజాయతీ, దయ, సహకారం, పట్టుదల, బాధ్యతలాంటి మానవీయ విలువలతో కూడిన నైతిక విద్యను బోధిస్తున్నారు. ఇక జపాన్ బడుల్లో ఆకట్టుకునే మరో అంశం శుభ్రతలో విద్యార్థుల బాధ్యత. క్లాస్‌‌రూమ్స్‌‌‌‌తో పాటు స్కూల్ పరిసరాలను విద్యార్థులే స్వయంగా క్లీన్ చేసుకుంటారు. దీంతో బాధ్యతా భావం, టీమ్‌‌‌‌వర్క్, పరిసరాలపై గౌరవం అలవడుతాయని అక్కడి టీచర్లు చెప్తున్నారు. అక్కడి విద్యార్థులకు న్యూట్రిషన్ స్కూల్ లంచ్ (మిడ్​  డే మీల్స్)  ద్వారా పౌష్టికాహారాన్ని అందించడంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పరిశుభ్రత, టేబుల్ మేనర్స్ నేర్పుతున్నారు.

పాఠ్యపుస్తకాలను బట్టీపట్టించే విధానానికి భిన్నంగా..గ్రూప్ యాక్టివిటీస్, చర్చలు, ప్రాజెక్టులు, ప్రయోగాలు, ప్రాక్టికల్ అనుభవాల ద్వారా నేర్చుకునే అభ్యసన పద్ధతిని అక్కడ ప్రోత్సహిస్తున్నారు. దీనితో పాటు ప్రత్యేక విద్యా అవసరాలు ఉన్న విద్యార్థులకు సైతం తోటివారితోపాటు సాధారణ క్లాసుల్లోనే పాల్గొనేలా సమ్మిళిత విద్య కింద తగిన సపోర్ట్ అందిస్తున్నారు. అలాగే, అకడమిక్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, ఆర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ మధ్య సమతుల్యతను పాటిస్తూ బ్యాలెన్స్‌‌డ్ స్కూల్ లైఫ్ గడిపేలా చక్కటి టైమ్‌‌టేబుల్‌‌‌‌ను అమలు చేస్తున్నారు. ఈ అనుభవాలను మన రాష్ట్ర విద్యారంగంలోనూ అమలు చేసేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని టీచర్ల బృందం చెప్తున్నది.  

ఒత్తిడి లేని చదువులు 
విద్యార్థులపై ఎలాంటి అనవసరమైన అకడమిక్ ఒత్తిడి మోపకుండా, వారిని ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపించే సురక్షితమైన, ఆహ్లాదకరమైన విద్యా వాతావరణాన్ని జపాన్ బడులు కల్పిస్తున్నాయి.  విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా.. తరగతి గది చర్చలు, ప్రాక్టికల్ వర్క్, గ్రూప్ యాక్టివిటీస్‌‌‌‌లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. అభ్యసన ప్రక్రియలో క్రియాశీలక భాగస్వాములుగా మారుతున్నారు.

డిజిటల్ టెక్నాలజీని జోడించి బోధనను మరింత ఇంటరాక్టివ్‌‌‌‌గా మలచడంతోపాటు  భూకంపాలులాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. అత్యవసర వేళల్లో ప్రశాంతంగా, ధైర్యంగా స్పందించే తర్ఫీదును చిన్ననాటి నుంచే అందిస్తున్నారు. కేవలం మార్కుల చదువు మాత్రమే కాకుండా విద్యార్థుల మనసు, వ్యక్తిత్వం, శారీరక ఆరోగ్యం సమతుల్యంగా అభివృద్ధి చెందేలా.. అత్యున్నత నైతిక విలువలు, క్రమశిక్షణ, బాధ్యతాయుత ప్రవర్తనను పెంపొందించే దిశగా జపాన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నడుస్తున్నది.