కరోనా మరణాల కట్టడికి కొత్త ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌కు కనుగొన్న తెలంగాణ సైంటిస్ట్

కరోనా మరణాల కట్టడికి కొత్త ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌కు కనుగొన్న తెలంగాణ సైంటిస్ట్

అమెరికాలో కనుగొన్న తెలంగాణ సైంటిస్ట్ తిరుమల దేవి

పేషెంట్లలో ఇమ్యూన్ ‘సిగ్నల్స్’ కట్ చేస్తే.. లంగ్స్ ఫెయిల్ కావు

సైటోకైన్ల వల్ల సెల్ డెత్ పాత్ వేలు యాక్టివేట్ అయితున్నయి

వీటిని ఆపితే.. అవయవాలు దెబ్బతినకుండా కాపాడొచ్చని వెల్లడి

సెల్‌ జర్నల్‌లో పబ్లిష్‌ అయిన రీసెర్చ్‌

వాషింగ్టన్: దునియాకు మహమ్మారిలా తయారైన కరోనాకు చెక్ పెట్టేందుకు మన సైంటిస్ట్ ఒకరు మంచి ఇకమతును కనిపెట్టిన్రు. వైరస్ సోకినోళ్లలో గుండె, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలు ఫెయిల్ కాకుండా అడ్డుకునేందుకు పవర్ ఫుల్ ట్రీట్ మెంట్ కు దారి చూపిన్రు. కరోనా పేషెంట్లలో ఇమ్యూన్ సిస్టం ఓవర్ గా రియాక్ట్ కావడం వల్ల లంగ్స్, ఇతర అవయవాలు ఫెయిల్ అయి ప్రాణాలు పోతున్నయి. అందుకే.. కరోనా పేషెంట్లలో ఆర్గాన్స్ ఫెయిల్ కాకుండా అడ్డుకోవడంపై అమెరికాలోని మన తెలంగాణ సైంటిస్ట్ డాక్టర్ తిరుమల దేవి కన్నెగంటి ఆధ్వర్యంలోని టీమ్ ఫోకస్ పెట్టింది. కరోనా వల్ల అవయవాలు ఫెయిల్ అయ్యేందుకు దారితీసే సెల్ డెత్ సిగ్నలింగ్ పాత్ వే గుట్టును పూర్తిగా తెలుసుకున్నది. ఈ సిగ్నలింగ్ పాత్ వేను అడ్డుకుంటే ఇమ్యూన్ సిస్టం మన అవయవాలను దెబ్బతీసేలా సిగ్నల్స్ ఇవ్వకుండా కట్ చేయొచ్చని.. దాంతో కరోనా వల్ల ప్రాణాలు పోకుండా కాపాడొచ్చని చెప్తున్నరు. కరోనాకు మాత్రమే కాకుండా సెప్సిస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు ట్రీట్ మెంట్ చేసేందుకు కూడా వీరి స్ట్రాటజీతో వీలవుతుందని  అంటున్నరు.

ఎలుకలపై రీసెర్చ్ సక్సెస్..

డాక్టర్ తిరుమల దేవి అమెరికా టెన్నిసీ స్టేట్ మెంఫిస్ సిటీలోని సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్ లో డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇమ్యునాలజీ వైస్ చైర్మన్ గా పనిచేస్తున్నారు. ఈమె ఆధ్వర్యంలోని టీమ్ ఎలుకలపై చేసిన రీసెర్చ్ వివరాలు ఇటీవల ‘సెల్’ జర్నల్ లో పబ్లిష్ అయ్యాయి. కరోనా పేషెంట్లలో కీలక అవయవాలు ఫెయిల్ అవుతుండడానికి సెల్ డెత్ పాత్ వేలు కీలకమని వీరు ఎలుకలపై జరిపిన రీసెర్చ్ ద్వారా తెలుసుకున్నారు.

లోగుట్టును తెలుసుకున్నరు..

కరోనా సోకిన పేషెంట్లలో హైపర్ ఇన్‌‌ఫ్లమేటరీ ఇమ్యూన్ రెస్పాన్స్ కారణంగా లంగ్స్, ఇతర అవయవాల కణాలు దెబ్బతింటున్నాయని ఇదివరకే గుర్తించారు. అయితే మన ఇమ్యూన్ సిస్టం సెల్ డెత్ పాత్ వేస్ ను యాక్టివేట్ చేయడం వల్లే ఆయా అవయవాల కణాలు దెబ్బతింటున్నాయని వీరు గుర్తించారు. ఈ పాత్ వేలు ఎలా పని చేస్తున్నాయన్నది పూర్తిగా తెలుసుకోగలిగారు. ఈ ప్రక్రియను అడ్డుకుంటే అవయవాలు దెబ్బతినకుండా కాపాడొచ్చని తేల్చారు.

రెండు సైటోకైన్లే కీలకం..

కరోనా పేషెంట్ల రక్తంలో ప్రధానంగా టీఎన్ఎఫ్ ఆల్ఫా, ఐఎఫ్ఎన్ గామా అనే రెండు రకాల కీలకమైన సైటోకైన్లు ఉంటున్నట్లు తిరుమల దేవి టీమ్ కనుగొన్నది. ఈ సైటోకైన్లు విపరీతంగా విడుదలైతే.. సెల్ డెత్ పాత్ వేలు ఎక్కువగా యాక్టివేట్ అయి, లంగ్స్, ఇతర అవయవాల కణాలను ఇమ్యూన్ సిస్టం బాగా దెబ్బతీస్తున్నట్లు గుర్తించారు. ‘పానొప్టోసిస్’ అనే ఈ సమస్యకు కారణమయ్యే సైటోకైన్లను అడ్డుకునే మందులను వాడితే అవయవాలు దెబ్బతినకుండా కాపాడొచ్చని వీరు కనుగొన్నారు.

కరోనాకు చెక్ పెట్టొచ్చు..  

అవయవాలు ఫెయిల్ అయ్యేందుకు కారణమైన సెల్ డెత్ పాత్ వేస్ ను, వాటి పనితీరును అర్థం చేసుకోవడం వల్ల సమర్థమైన చికిత్సలకు వీలు కలుగుతుంది. సెల్ డెత్ పాత్ వేలను యాక్టివేట్ చేసే ప్రత్యేక సైటోకైన్స్ (ప్రొటీన్స్)ను కూడా మేం గుర్తించినం. సైటోకైన్స్ ను కంట్రోల్ చేయడం ద్వారా కరోనాతో పాటు సెప్సిస్, ఇతర ప్రాణాంతక వ్యాధులను అడ్డుకునేందుకు వీలు కానుంది.

– డాక్టర్ తిరుమల దేవి కన్నెగంటి

కేయూలో డిగ్రీ, ఓయూలో పీహెచ్‌డీ

డాక్టర్ తిరుమల దేవి వరంగల్ కు చెందిన వారు. ఆమె కాకతీయ యూనివర్సిటీలో బీఎస్సీ బీజడ్ సీలో డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ, పీహెచ్ డీ చేశారు. అమెరికా, టెన్నిసీ స్టేట్ మెంఫిస్ సిటీలోని సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్ లో 2007లో చేరారు. ఈ రీసెర్చ్ కు రాజేంద్ర కర్కి, బిహేశ్ రాజ్ శర్మ కో ఆథర్లుగా వ్యవహరించారు. రీసెర్చ్ లో శ్రద్ధా తులాధర్, పరిమళ్ సమీర్, బాల మురుగన్ సుందరమ్, బాలాజీ బానోత్, ఆర్ కే సుబ్బారావు మలిరెడ్డి వంటి మరికొందరు ఇండియన్ అమెరికన్లు, ఇతర సైంటిస్టులు కూడా పాల్గొన్నారు.

For More News..

ఆసీస్‌ వెళ్లేందుకు ఎదురుచూస్తున్నా

బ్యాక్ టు ఇండియా.. వందేళ్ల కింద ఎత్తుకుపోయిన విగ్రహం

పేరుకే ఎంసెట్ స్పాట్ కౌన్సెలింగ్.. ఇష్టారాజ్యంగా అడ్మిషన్లు