- విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్రెడ్డి వెల్లడి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ యాసంగి కోసం రైతులకు అందుబాటులో ఉండేలా ఆరు రకాల వరి విత్తనాలను సిద్ధం చేసింది. మొత్తం 50వేల క్వింటాళ్లు అందుబాటులోకి తెచ్చింది. ప్రధానంగా కేన్ఎం 1638 రకం 125 నుంచి 135 రోజుల పంట కాలంతో పాటు ఎకరానికి 30 నుంచి 32 క్వింటాళ్ల దిగుబడిని ఇస్తుంది. తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్15048 వరి రకం125 రోజుల్లో పంట దిగుబడి వస్తుంది. ఎకరానికి 26 నుంచి 28 క్వింటాళ్ల దిగుబడి ఉంటుంది. కాటన్ దొర సన్నాలు ఎంటీయూ 1010 రకం వరితో 120 నుంచి 125 రోజుల్లో 26 నుంచి 27 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
కూనారం సన్నాలు కెఎన్ఎం 118 వరి రకంతో 125 రోజుల్లో 28 నుంచి 32 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. జేజీఎల్ 24423 వరి రకంతో 125 నుంచి 135 రోజుల్లో ఎకరానికి 34 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అలాగే పప్పు శనగలు, వేరు శెనగల విత్తనాలతో పాటు అడపదడపా వేసే మినుములు, నువ్వులు, కుసుమలు, ఆవాలు, రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్న విత్తనాలు సిద్ధం చేశారు. మొక్కజొన్న , ఆల్ఫాల్ఫా గడ్డి రకాలను కూడా సిద్ధం చేసింది.