‘పాలమూరు’కు 90 టీఎంసీలతో అనుమతివ్వండి

‘పాలమూరు’కు 90 టీఎంసీలతో అనుమతివ్వండి
  • ప్రాజెక్టు అప్రైజల్‌‌ ఆర్గనైజేషన్‌‌ను కోరిన తెలంగాణ

హైదరాబాద్‌‌, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్‌‌ స్కీం నుంచి 90 టీఎంసీల నీటిని వాడుకునేందుకు అనుమతులు ఇవ్వాలని తెలంగాణ కోరింది. సీడబ్ల్యూసీలోని ప్రాజెక్ట్‌‌ అప్రైజల్‌‌ ఆర్గనైజేషన్‌‌ చీఫ్‌‌ ఇంజనీర్‌‌ అధ్యక్షతన ఢిల్లీలో ప్రాజెక్టుకు పర్మిషన్‌‌లపై సమావేశం నిర్వహించారు. జలసౌధ నుంచి ఇరిగేషన్‌‌ స్పెషల్‌‌ సీఎస్‌‌ రజత్‌‌ కుమార్‌‌, ఈఎన్సీ(జనరల్‌‌) మురళీధర్‌‌, సీఈ హమీద్‌‌ ఖాన్‌‌ వర్చువల్‌‌గా పాల్గొని ప్రాజెక్టుపై పవర్‌‌ పాయింట్‌‌ ప్రజంటేషన్‌‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు డీపీఆర్‌‌లో పేర్కొన్న అన్ని అంశాలపై వివరణ ఇచ్చారు. శ్రీశైలంలో 75 శాతం డిపెండబిలిటీ వద్ద 582.5 టీఎంసీల నీటి లభ్యత ఉందని, నాగార్జునసాగర్, హైదరాబాద్‌‌, చెన్నై నగరాల తాగునీటి అవసరాలు, ఎస్‌‌ఆర్బీసీ అవసరాలు, ఆవిరి నష్టాలను కలుపుకుంటే 352.50 టీఎంసీల నీటి అవసరాలు ఉన్నాయని తెలిపారు. ఇవిపోను శ్రీశైలంలో మిగిలే 230 టీఎంసీల్లో పాలమూరుకు 90 టీఎంసీలు వినియోగించుకునేందుకు పర్మిషన్‌‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

తెలంగాణ మైనర్‌‌ ఇరిగేషన్‌‌కు బచావత్‌‌ ట్రిబ్యునల్‌‌ 90.81 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయని తెలిపారు. ఇందులో మైనర్‌‌ ఇరిగేషన్‌‌కు వినియోగించుకోకుండా ఉన్న 45.15 టీఎంసీలు పాలమూరుకు బదలాయించామన్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీలకు బదులుగా నాగార్జునసాగర్‌‌కు ఎగువన 80 టీఎంసీల కృష్ణా నికర జలాలు వినియోగించుకునేందుకు బచావత్‌‌ ట్రిబ్యునల్‌‌ అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. 1978 ఆగస్టు 4న బచావత్‌‌ ట్రిబ్యునల్‌‌ ముందు కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం (అనెగ్జర్‌‌–సి) 35 టీఎంసీలు కర్నాటక, మహారాష్ట్ర 45 టీఎంసీలు తెలంగాణ ప్రాంతానికి కేటాయించేందుకు అంగీకారం కుదిరిందని తెలిపారు. శ్రీశైలంలో అన్ని అవసరాలు పోను మిగిలిన 230 టీఎంసీల్లో పాలమూరుకు 90, ఎస్‌‌ఎల్బీసీకి 40, కల్వకుర్తికి 40, డిండి ఎత్తిపోతలకు 30 టీఎంసీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాధాన్యత గురించి 2014 ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత ప్రధాని మోడీ ప్రసంగించిన వీడియో రికార్డింగ్‌‌ ప్లే చేశారు. ఉమ్మడి ఏపీలో 2013లోనే ఈ ప్రాజెక్టును చేపట్టారని, ఇది రాష్ట్ర విభజన తర్వాత తలపెట్టిన ప్రాజెక్టు కాదన్నారు. హైదరాబాద్‌‌తో పాటు నాగర్‌‌ కర్నూల్‌‌, మహబూబ్‌‌ నగర్‌‌, నారాయణపేట, వికారాబాద్‌‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని 1,126 గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టుకు రెండో దశ పర్యావరణ అనుమతుల కోసం ఈ ఏడాది ఆగస్టు 24న దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. ప్రాజెక్టు నిర్వహణకు 2,944 మెగావాట్ల కరెంట్‌‌ అవసరమని.. ఏడాదికి 3,013 మిలియన్‌‌ యూనిట్ల కరెంట్‌‌ వినియోగిస్తామని తెలిపారు. 2015లో రూ.35,200 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణానికి పర్మిషన్‌‌ ఇవ్వగా ప్రస్తుతం రూ.55,086 కోట్లకు చేరిందని తెలిపారు. ఫ్లోరైడ్‌‌ ప్రభావ, కరువు పీడిత ప్రాంతాలకు తాగునీరు ఇచ్చేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టుకు పర్మిషన్‌‌లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.