మన శకటంపై..జయ జయ హే తెలంగాణ..

మన శకటంపై..జయ జయ హే తెలంగాణ..

న్యూఢిల్లీ, వెలుగు :  ఢిల్లీలోని కర్తవ్యపథ్ పై మంగళవారం నిర్వహించిన రిపబ్లిక్ డే ఫుల్ డ్రెస్ రిహార్సల్స్​లో తెలంగాణ శకటం అందరినీ ఆకట్టుకుంది. ‘అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్య కాంక్ష: తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుల వారసత్వం’ అనే థీమ్​తో శకటాన్ని అధికారులు తయారు చేస్తున్నారు. ‘ప్రజాస్వామ్య మట్టి పరిమళాలు – జన సామాన్య ప్రజాస్వామ్య యోధులు’గా కొమురంభీమ్, రాంజీ గోండు, చాకలి ఐలమ్మల వీరోచిత పోరాటాలను స్మరించుకునేలా శకటాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్నది. 

ఈ శకటం ద్వారా 20వ శతాబ్దం ఆరంభంలో స్వయం పాలన, ప్రజల ప్రజాస్వామ్య (లోక్ తంత్ర) పునరుద్ధరణ, మా భూమిలో – మా రాజ్యం అనే తెలంగాణ వీరుల పోరాటాలను దేశ ప్రజలకు చాటబోతున్నది. శకటంపై అందెశ్రీ రాసిన ‘జయ జయ హే తెలంగాణ..’ గేయంలోని పదాలు కనిపించబోతున్నాయి. తెలంగాణ వీరోచిత పోరాటాన్ని, ఆ నాటి పది జిల్లాల ఔనత్యాన్ని చాటుతూ... అందెశ్రీ ఈ గేయం రాశారు. 

అయితే, గత ప్రభుత్వం ఈ గేయాన్ని పక్కనపెట్టిందన్న విమర్శలు ఉన్నాయి. శకటానికి ఇరువైపులా తెలుగులో ఈ బోర్డులను ఏర్పాటు చేయనుంది. కాగా, తెలంగాణ శకటం పనులు తుది దశలో ఉన్నందున ఫుల్ డ్రెస్ రిహార్సల్ లో ఈ బోర్డులు కన్పించలేవు. ఛబ్బీస్ జనవరిన జరిగే పరేడ్ లో శకటంపై ఈ బోర్డులు ప్రదర్శించబోతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.