మన శకటానికి గ్రీన్ సిగ్నల్

మన శకటానికి గ్రీన్ సిగ్నల్

రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రదర్శించేందుకు ఆమోదం
రాష్ట్రానికి మూడేళ్ల తర్వాత చాన్స్

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్​లో ప్రదర్శించే సాంస్కృతిక శకటాల్లో తెలంగాణ శకటానికి తుది ఆమోదం లభించింది. దీనికి సంబంధించి మంగళవారం డిఫెన్స్ సెరెమోనియల్ కమిటీ ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన శకటాల థీమ్స్ ప్రజెంటేషన్ పై కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతి సమావేశంలో కమిటీ ఇచ్చిన సూచనల మేరకు మార్పులు, చేర్పులు చేస్తూ తుది నమూనాను ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ సిద్ధం చేశారు. శకట డిజైన్ ను రాష్ట్ర సమాచార శాఖ రూపొందించిందని, తాను ప్రజెంటేషన్ ఇచ్చానని గౌరవ్ ఉప్పల్ తెలిపారు. రాష్ట్ర కల్చర్ గొప్పతనాన్ని చాటేలా శకటాన్ని ప్రదర్శిస్తామని రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ తెలిపారు.

మన శకటం ప్రత్యేకతలివే..

రాష్ట్రం నుంచి చివరిసారిగా 2015లో ‘బోనాలు’ శకటం ప్రదర్శనకు ఎంపికైంది. ఈసారి ఎంపికైన శకటం రాష్ట్ర సంస్కృతి, చరిత్ర, వాస్తు కళలు, పండుగలను చాటేలా రూపుదిద్దుకోనుంది. ముందు భాగం రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాలను చాటుతుంది. మధ్య భాగంలో సమ్మక్క, సారక్కల గద్దెలను ప్రతిబింబించేలా అమ్మవారి భారీ రూపం ఉంటుంది. వెనక భాగంలో కాకతీయుల వాస్తు కళను చాటేలా వెయ్యి స్తంభాల గుడి స్ట్రక్చర్ ఉంటుంది. శకటానికి ఇరు వైపులా, గద్దెల చుట్టూ గిరిజనుల సంబురాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లుగా గిరిజనుల రూపంలో కళాకారులు ఉంటారు.

ఏపీ శకటం కూడా ఎంపిక

రిపబ్లిక్ డే వేడుకలకు ఏపీ శకటం కూడా ఎంపికైంది. తిరుమల బ్రహ్మోత్సవాలు, కూచిపూడి, కొండపల్లి హస్త కళలు, కళంకారి పెయింటింగ్స్ తో కూడిన శకట నమూనాకు కమిటీ ఆమోదం తెలిపింది.