నెలాఖరులోగా 10 వేల మందికి గొర్రెలిస్తం

నెలాఖరులోగా 10 వేల మందికి గొర్రెలిస్తం
  • పశు సంవర్ధక శాఖ డైరెక్టర్  హామీ
  • గొర్రెల పంపిణీపై జీఎంపీఎస్‌‌తో చర్చలు సఫలం
  • డైరెక్టరేట్‌‌ ముట్టడి వాయిదా 

హైదరాబాద్‌‌, వెలుగు : పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌‌తో తమ చర్చలు సఫలం అయ్యాయని, దీంతో డెరెక్టరేట్‌‌ ముట్టడిని తాత్కాలికంగా వాయిదా వేశామని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్‌‌) ప్రకటించింది. బుధవారం పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌‌  డాక్టర్‌‌  రాంచందర్‌‌.. జీపీఎంఎస్ రాష్ట్ర బృందాన్ని చర్చలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీఎంపీఎస్‌‌  నేతలు గొర్ల కాపర్లకు సంబంధించిన పది డిమాండ్లను డైరెక్టర్  ముందు ఉంచారు. గొర్ల పంపిణీలో దళారుల ప్రమేయం లేకుండా నగదు బదిలీ చేయాలనే డిమాండ్ మంచిదే అయినప్పటికీ అది తన పరిధిలో లేదని డైరెక్టర్ చెప్పారు. గొర్ల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. జులై నెలాఖరులో పదివేల మందికి పంపిణీ చేస్తామని తెలిపారు. గొర్ల యూనిట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన గొర్ల కొనుగోలు కేంద్రాలను రద్దు చేయాలని జీఎంపీఎస్  ప్రతినిధులు పట్టుబట్టారు. 

అయితే, డీడీ చెల్లించిన లబ్ధిదారులు 300 కిలోమీటర్ల బయట గొర్లను ఎంపిక చేసుకుని కొనేందుకు అవకాశం కల్పిస్తామని డైరెక్టర్‌‌  హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అప్పుడు నచ్చిన చోట గొర్లను కొనుక్కోవచ్చనన్నారు. మొదటి విడతలో మిగిలిపోయిన లబ్ధిదారులకు, రెండో విడత లబ్ధిదారులకు గొర్లను పంపిణీ చేస్తామని చెప్పారు. అయితే, గొర్ల పంపిణీకి కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇవ్వాలని అధికారులు మెలిక పెడుతున్నారని, సొసైటీలు ఎంపిక చేసిన లబ్ధిదారులకు గొర్ల యూనిట్ ఇవ్వాలని జీఎంపీఎస్  బృందం కోరింది. దీనిపై పరిశీలన చేస్తామని డైరెక్టర్  హామీ ఇచ్చారు. అలాగే సొసైటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులను నియమిస్తామని ఆయన తెలిపారు. వివిధ ప్రమాదాల్లో మరణించిన గొర్లకు బీమా చెల్లించని కంపెనీలపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.