నా ఫ్రెండ్ చార్లీని చంపిన హంతకుడు దొరికిండు.. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్

నా ఫ్రెండ్ చార్లీని చంపిన హంతకుడు దొరికిండు.. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్  ట్రంప్

వాషింగ్టన్: తన ఫ్రెండ్, కన్జర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్​ను కాల్చి చంపిన హంతకుడు దొరికాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  తెలిపారు. రెండు రోజుల తర్వాత పోలీసులు అతడిని పట్టుకున్నారని, ఇప్పుడు హంతకుడు వారి అదుపులో ఉన్నాడని ట్రంప్.. ఫాక్స్  న్యూస్ కు వెల్లడించారు.పోలీసు ఉన్నతాధికారుల్లో ఒకరు ఆ అనుమానిత హంతకుడిని చట్టానికి పట్టించారని తెలిపారు. 

ఉటా రాష్ట్రం ఓరెమ్  సిటీలోని ఉటా వ్యాలీ యూనివర్సిటీలో చార్లీ కిర్క్ (31) ఓ డిబేట్ లో మాట్లాడుతుండగా.. వర్సిటీకి సమీపంలోని ఓ బిల్డింగ్  రూఫ్ టాప్ పై నుంచి దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. బుల్లెట్ చార్లీ మెడలోకి దూసుకుపోవడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చార్లీ చనిపోయారు.

48 గంటల్లో నిందితుడి అరెస్ట్​

చార్లీ కిర్క్ ను కాల్చి చంపిన అనుమానితుడిని 48 గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని ఉటా రాష్ట్రానికి చెందిన టైలర్  రాబిన్సన్(22) గా గుర్తించారు. చార్లీపై కాల్పులు జరిపిన తర్వాత అతను పారిపోయాడు. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలించారు.