మేం అడిగితే వాటర్ రిలీజ్ ఆర్డర్ ఇవ్వరు.. ఏపీ అడగ్గానే ఇచ్చేస్తరా..? కృష్ణా బోర్డుపై తెలంగాణ అభ్యంతరం

మేం అడిగితే వాటర్ రిలీజ్ ఆర్డర్ ఇవ్వరు.. ఏపీ అడగ్గానే ఇచ్చేస్తరా..? కృష్ణా బోర్డుపై తెలంగాణ అభ్యంతరం
  • మేం అడిగితే వాటర్ రిలీజ్ ఆర్డర్ ఇవ్వరు.. ఏపీ అడగ్గానే ఇచ్చేస్తరా
  • కృష్ణా బోర్డుకు ఈఎన్​సీ అనిల్ కుమార్ లేఖ
  • ఏపీ కోటా అయిపోయినా నీళ్లిచ్చేందుకు ఆర్డర్స్ ఎలా ఇస్తరు
  •   సాగర్​లో 505 అడుగుల వరకు నీటిని తీసుకెళ్లాలని చెప్పడమేంటని ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: తాగునీటి కోసం కృష్ణా బోర్డు ఏకపక్షంగా వాటర్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చిందని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. నాగార్జునసాగర్​లో 505 అడుగుల వరకూ నీటిని తీసుకెళ్లొచ్చంటూ నిర్ణయం తీసుకున్నదని పేర్కొంది. సాగర్​లో ఎట్టిపరిస్థితుల్లోనూ కనీస నీటిమట్టం 510 అడుగులు మెయింటెయిన్​ చేయాలని పదే పదే కోరినా పెడచెవిన పెట్టిందని, ఏఎంఆర్పీ లిఫ్ట్​ స్కీమ్​కు 510 అడుగుల వద్ద నుంచే నీటిని తీసుకునేందుకు వీలవుతుందని పేర్కొన్నా వినలేదని తెలిపింది.

ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్​కు ఈఎన్​సీ జనరల్ అనిల్ కుమార్ లేఖ రాశారు. త్రీమెంబర్ కమిటీ మీటింగ్​లో శ్రీశైలంలో 800 అడుగులకు దిగువన, సాగర్​లో 510 అడుగులకు దిగువన నీటిని తీసుకోకూడదన్న నిర్ణయానికి వచ్చారు కదా అని ప్రశ్నించారు. వాటర్ రిలీజ్ ఆర్డర్ ఇవ్వాలంటూ ఎన్నిసార్లు తెలంగాణ కోరినా పట్టించుకోలేదని, కానీ, ఏపీ 10 టీఎంసీల నీళ్లు కావాలని అడగ్గానే.. వెంటనే వాటర్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చారని ఈఎన్​సీ అనిల్ కుమార్ ఫైర్ అయ్యారు.

వాటర్ ఇయర్ మరో పది రోజుల్లో పూర్తవుతుందనగా.. ఏపీ కోటా అయిపోయినప్పటికీ ఆగమేఘాలపై వాటర్​ రిలీజ్ ఆర్డర్ ఇచ్చారని ఆరోపించారు. అదే తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటిని విడుదల చేయాలని కోరినా కూడా మీనమేషాలు లెక్కించారని అన్నారు. ఏపీ ఎప్పుడు అడిగితే అప్పుడు.. అడిగిందే తడవుగా వాటర్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చేస్తున్నారని, తెలంగాణ రిక్వెస్ట్​ను మాత్రం లెక్క చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేఆర్​ఎంబీ వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు.

ఏపీకి సాగర్ నుంచి నీళ్లిస్తే మాకెట్లా..

ప్రస్తుతం సాగర్​లో 510 అడుగులకు ఎగువన కేవలం 4.458 టీఎంసీల నీళ్లే ఉన్నాయని, ఏపీకి సాగర్​ కుడి కాల్వ ద్వారా 4 టీఎంసీల నీటిని ఇచ్చేస్తే తమ పరిస్థితి ఏంటని ఈఎన్​సీ అనిల్ కుమార్ బోర్డును ప్రశ్నించారు. ఏపీ నీటిని తీసుకెళ్తే ఏఎంఆర్పీకి నీళ్లు రావడం కష్టమన్నారు. ఇటు శ్రీశైలం నుంచి సాగర్​కు నీటి విడుదల గురించి కూడా వాటర్ రిలీజ్ ఆర్డర్​లో కనీసం ప్రస్తావించలేదన్నారు. అసలు వాటర్ రిలీజ్ ఆర్డర్​ను బోర్డు మెంబర్ సెక్రటరీ ఇవ్వాల్సి ఉంటుందని, కానీ, చైర్మన్ ఆమోదం ఉన్నా కూడా ఓఎస్ఈ వాటర్ రిలీజ్ ఆర్డర్​ ఇవ్వడం తీవ్ర అభ్యంతరకరమని వ్యాఖ్యానించారు. కనుక వాటర్ రిలీజ్ ఆర్డర్​ను సవరించి మళ్లీ ఇవ్వాలని, సాగర్​లో 510 అడుగుల కనీస మట్టాన్ని మెయింటెయిన్​ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు.