వికారాబాద్, వెలుగు: తనపై నిరాధార ఆరోపణలు చేసి.. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారంటూ వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్‌కు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లీగల్ నోటీసులు పంపించారు. మానసిక క్షోభకు గురి చేసినందుకు రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించడంతోపాటు 7 రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల 14, 19 తేదీల్లో జరిగిన మీడియా సమావేశాల్లో మెతుకు ఆనంద్ నిరాధార, తప్పుడు ఆరోపణలు చేసి తన వ్యక్తిగత జీవితం, గౌరవానికి భంగం కలిగించారని స్పీకర్ పేర్కొన్నారు.
శాసనసభ్యుల అనర్హత అంశంలో లంచాల ఆరోపణలు చేయడం శాసన సభాపతి పదవిని అవమానించడమేనని స్పష్టం చేశారు. అలాగే, పురపాలక సంఘం అంశంలో కట్టు కథలు అల్లడంతోపాటు అవహేళన చేసేలా వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహిత–2023లోని సెక్షన్ 499, 500 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
