V6 News

రికార్డు రిజల్ట్స్.. టెన్త్‌‌‌‌లో 95 శాతం పాస్.. ఫలితాల్లో ములుగు ఫస్ట్.. హైదరాబాద్ లాస్ట్

రికార్డు రిజల్ట్స్.. టెన్త్‌‌‌‌లో 95 శాతం పాస్.. ఫలితాల్లో ములుగు ఫస్ట్.. హైదరాబాద్ లాస్ట్
  • భారీగా పెరిగిన పాస్ పర్సంటేజీ.. సత్తాచాటిన గురుకులాలు 
  • ఉత్తీర్ణతా శాతంలో అమ్మాయిలదే పైచేయి
  • బాలురు 94%, బాలికలు 96% పాస్‌‌‌‌
  • 5,731 బడుల్లో 100% రిజల్ట్.. 
  • 6 ప్రైవేట్‌‌‌‌ స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాలే 
  • ఫలితాలు రిలీజ్ చేసిన కేకే, యోగితారాణా 
  • రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌‌‌‌కు 30 నుంచి దరఖాస్తులు

హైదరాబాద్, వెలుగు: పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు రికార్డు సృష్టించారు. ఈ ఏడాది ఏకంగా 95.15 శాతం మంది పాసయ్యారు.  నిరుడితో పోలిస్తే పాస్ పర్సంటేజీ  2.37 శాతంపెరిగింది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సర్కారు గురుకులాలు సత్తా చాటాయి. ఫలితాల్లో ములుగు జిల్లా టాప్‌‌‌‌లో ఉండగా, హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. ఈ సారి 6  ప్రైవేట్‌‌‌‌ స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాలేదు. బుధవారం ఎస్సీఈఆర్టీ భవనంలో పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్‌‌‌‌తో కలిసి  ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు రిలీజ్ చేశారు.

రాష్ట్రంలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదో తరగతి పరీక్షలు జరగ్గా.. ఏప్రిల్ 23 వరకూ వ్యాల్యుయేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ పరీక్షలకు 5,28,309 మంది రిజిస్టర్‌‌‌‌‌‌‌‌ చేసుకోగా, 5,26,166 మంది ఎగ్జామ్స్‌‌‌‌ రాశారు. వీరిలో 4,97,312 మంది పాసయ్యారు. పాసైన వారిలో 2,48,679 మంది బాలురు ఉండగా, 2,48,633 మంది బాలికలున్నారు.  ఎప్పటిలాగే ఈసారి కూడా ఫలితాల్లో అమ్మాయిలే పైచేయి సాధించారు. బాలుర ఉత్తీర్ణత 94.07 శాతం ఉండగా, బాలికలు 96.26 శాతంతో  సత్తాచాటారు. 

5,731 బడుల్లో అందరూ పాస్..
రాష్ట్రవ్యాప్తంగా 11,677 హైస్కూళ్లు ఉండగా, వాటిలో మొత్తం 5,731 బడుల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. అదే సమయంలో 6  ప్రైవేటు స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. అత్యధికంగా 5,149 ప్రైవేటు బడులకు 2,517 స్కూళ్లు, 4,125 జిల్లా పరిషత్ హైస్కూళ్లకు 2,065 బడుల్లో వందశాతం మంది ఉత్తీర్ణత సాధించారు. కేజీబీవీలు 290, బీసీ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌లో 197, సోషల్ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌లో 152, ఆశ్రమ పాఠశాలల్లో 124, మైనార్టీ గురుకులాల్లో 119, మోడల్ స్కూళ్లలో 83, గవర్నమెంట్ స్కూళ్లలో 65, ట్రైబల్ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌లో 60, ఎయిడెడ్ స్కూళ్లలో 36 బడుల్లో పరీక్షలు రాసిన విద్యార్థులంతా పాసయ్యారు. బాలుర కంటే అమ్మాయిలు 2.19 శాతం అధికంగా పాసయ్యారు.

ములుగు టాప్.. పట్నం లాస్ట్
రెగ్యులర్ విద్యార్థుల్లో జిల్లాలవారీగా చూస్తే ములుగు జిల్లా 99.30 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. నాగర్ కర్నూల్ (99.03%), నిర్మల్ (98.96%), జగిత్యాల (98.87%) జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే, హైదరాబాద్ జిల్లా మాత్రం కేవలం 89.23 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం (90.58%), వికారాబాద్ (91.25%), రంగారెడ్డి (92.96%) జిల్లాల్లో చివరి వరుసలో నిలిచాయి.  25 జిల్లాలు ఏకంగా 95 శాతానికి పైగా, 12 జిల్లాలు 98 శాతానికి పైగా ఉత్తీర్ణత సాధించడం విశేషం.

గురుకులాల హవా.. 
సర్కారు గురుకులాలు ఈ సారి కూడా తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి. సాంఘిక సంక్షేమ గురుకులాల నుంచి 16,845 మంది పరీక్షలు రాయగా, 16,693 మంది (99.10%)  పాసై టాప్‌‌‌‌‌‌‌‌లో  నిలిచాయి. బీసీ సంక్షేమ గురుకులాలు 98.99%, తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ 98.64%, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలు 98.13%, మైనార్టీ గురుకులాలు 98.08% పాస్ పర్సంటేజీతో సత్తా చాటాయి. అత్యల్పంగా గవర్నమెంట్ స్కూళ్లలో 86.18%,  జిల్లా పరిషత్ హైస్కూళ్లలో 93.53% పాస్ పర్సంటేజీ నమోదైంది. 

30 నుంచి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తులు 
టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని భావించే విద్యార్థులకు ప్రభుత్వ పరీక్షల విభాగం మరో అవకాశం కల్పిస్తున్నది.  రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఈ నెల 30 నుంచి మే 14 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. కేవలం తమ మార్కులను రీకౌంటింగ్ చేసుకోవాలనుకునే వారు ఒక్కో సబ్జెక్టుకు రూ. 500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.

ఒకవేళ వాల్యూయేషన్ చేసిన జవాబు పత్రం ఫొటో కాపీ కావాలనుకున్నా, మార్కుల లెక్కింపులో ఏవైనా తప్పులు ఉన్నాయని భావిస్తే రీవెరిఫికేషన్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.వెయ్యి చెల్లించాలని సూచించారు. రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసిన విద్యార్థులు విడిగా రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. విద్యార్థులు తమ దరఖాస్తులను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ద్వారానే సమర్పించాలని కోరారు. బోర్డు అధికారిక వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ https://bse.telangana.gov.in ద్వారా మే 14లోపు అప్లై చేయాలని సూచించారు.