
- రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా – 2023 నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణ 8వ స్థానంలో ఉంది. అలాగే, రోడ్డు ప్రమాద మరణాల్లో 10వ స్థానంలో ఉంది. 2023లో రాష్ట్ర వ్యాప్తంగా 22,903 రోడ్డు ప్రమాదాలు జరిగి.. 7,660 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్రం వెల్లడించింది. అయితే, ఘోరమైన యాక్సిడెంట్ల ర్యాంకింగ్స్ లో తెలంగాణ 22 వ స్థానంలో ఉన్నట్టు తెలిపింది. 2022తో పోల్చితే రాష్ట్రంలో సుమారు వెయ్యికి పైగా ప్రమాదాలు పెరిగినట్టు తెలిపింది. ఇదే సందర్భంలో దేశ వ్యాప్త ప్రమాదాల్లో తెలంగాణ రాష్ట్ర భాగస్వామ్యం 4.8 గా, మరణాల్లో 4.4 గా నమోదయినట్టు పేర్కొంది.
దేశంలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించి శుక్రవారం కేంద్ర రోడ్డు, రవాణా శాఖ ‘రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా – 2023’రిపోర్ట్ ను విడుదల చేసింది. ఆ ఏడాది దేశ వ్యాప్తంగా 36 రాష్ట్రాలు/యూటీల్లో 4,80,583 రోడ్డు ప్రమాదాలు జరిగినట్టు వెల్లడించింది. ఇందులో 1,72,890 మంది మృత్యువాత పడినట్టు పేర్కొంది. 2022తో పోల్చితే 2023లో రోడ్డు ప్రమాదాలు 4.2 శాతం పెరిగినట్టు తెలిపింది. ఇందులో 18–45 ఏండ్ల మధ్య వయసు గల యువకులే 66.4 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.
అయితే, దేశంలో అత్యధిక ప్రమాదాలు జరిగిన రాష్ట్రాల జాబితాలో తమిళనాడు(67,213) ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అయితే, ప్రమాదాల్లో మరణాల పట్టికలో.. 23,652 మరణాలతో యూపీ మొదటి ప్లేస్ లో ఉంది. మరణాల్లో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులు(45శాంత) ఉన్నారు.