
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థుల కోసం దసరా నుంచి కొత్త పథకాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రకటించింది. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీంను అమలు చేయబోతున్నట్లు వెల్లడించింది. ఈ పథకాన్ని అక్టోబర్ 24వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించబోతున్నారు.
దసరా నుంచి తెలంగాణలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల్లో సీఎం అల్పాహార పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపింది. ఈ కొత్త పథకంతో ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ. 400 కోట్ల అదనపు భారం పడనుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహార పథకం ఇప్పటికే తమిళనాడులో అమలవుతోంది. తమిళనాడు పథకం అమలు తీరును రాష్ట్ర అధికారులు అక్కడకు వెళ్లి పరిశీలించారు. అయితే తమిళనాడులో కేవలం ప్రాథమిక పాఠశాలల్లోనే అల్పాహార పథకాన్ని అమలు చేస్తుండగా..తెలంగాణలో ఉన్నత పాఠశాలల్లోనూ అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణకు చెందిన ప్రత్యేక వంటకాలను ఈ టిఫిన్ ద్వారా అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.