పిల్లలు ప్రైవేటు స్కూళ్లకే పోతున్నరు

పిల్లలు ప్రైవేటు స్కూళ్లకే పోతున్నరు
  • సర్కారు బడుల్లో పెరగని అడ్మిషన్స్‌‌
  • ప్రైవేటులో 53.72 శాతం,సర్కారులో 46.28 శాతం
  • హైస్కూల్స్‌‌లో గవర్నమెంట్‌‌ హవా
  • యూడైస్‌‌ లెక్కల్లో తేటతెల్లం

హైదరాబాద్‌‌,వెలుగు: రాష్ర్టంలో గవర్నమెంట్‌‌ స్కూళ్లు ఏటేటా పెరుగుతున్నా..  వాటిల్లో చేరే స్టూడెంట్స్ సంఖ్య మాత్రం తగ్గుతోంది. ప్రైవేటు స్కూళ్లలో మాత్రం ఏటా పెరుగుతూనే ఉంది. గత ఏడాదితో పోలిస్తే గవర్నమెంట్ స్కూళ్లలో 70,993 మంది తగ్గారు. 2018-–19 విద్యాసంవత్సరంలో సర్కారీ స్కూళ్లలో 46.28%  స్టూడెంట్స్ ఉంటే..  ప్రైవేటులో 53.72%  ఉన్నారు. ప్రభుత్వ పెద్దలు మాత్రం సర్కారీ బడుల్లో విద్యార్థులు భారీగా పెరిగారని ప్రచారం చేసుకోవడం గమనార్హం. ఇవన్నీ తప్పులేనని ఇటీవల కేంద్రానికి ఇచ్చిన యూడైస్‌‌ లెక్కలు తేటతెల్లం చేస్తున్నాయి.

మొత్తంగానే తగ్గారు..

రాష్ర్టంలోని 42వేలకు పైగా స్కూళ్లలో 2017-–18 విద్యాసంవత్సరంలో 58,36,310 మంది చదువుకోగా, 2018-–19లో 58,06,652 మంది చదువుకున్నారు. ఈ లెక్కన సుమారు 29,658 మంది తగ్గిపోయారు. బడిబయట విద్యార్థులు కూడా తగ్గడంతో, స్టేట్‌‌లోనే బర్త్‌‌డే రేటే తగ్గిందని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. ఒకటో తరగతిలో 2017-–18లో 6,55,436 మంది చదివితే, 2018-–19లో 6,06,641 మందే చదివారు. ఒక్క ఏడాదిలోనే  సుమారు 50 వేల ఎన్ రోల్‌‌మెంట్‌‌ తగ్గింది. రెండో తరగతిలోనూ ఇదే పరిస్థితి ఉంది. అయితే ఈ రెండు విద్యాసంవత్సరాల్లో ఐదో తరగతి వరకూ  ప్రైవేటు బడుల్లో అడ్మిషన్స్ ఎక్కువగా ఉండగా, హైస్కూల్‌‌(ఆరు నుంచి పది) స్థాయిలో మాత్రం గవర్నమెంట్‌‌ విద్యాసంస్థల్లో అడ్మిషన్స్  ఎక్కువగా ఉన్నాయి. దీనికి ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలతో పాటు కేజీబీవీ,మోడల్‌‌ స్కూళ్లు ఉండటమే కారణం.

ప్రైవేటులో పెరిగిన అడ్మిషన్స్

రాష్ర్టంలో ప్రైవేటు స్కూళ్లు 11,700 వర కూ ఉన్నాయి. వాటిలో 2017-–18లో 30,77,884(52.73శాతం) మంది చదివితే, 2018-–19లో ఆ సంఖ్య 31,19,219(53.72శాతం)  మందికి చేరింది. ఒక్క ఏడాదిలోనే 41,335 అడ్మిషన్స్‌‌ పెరిగాయి. 2017-–18లో ఒకటో తరగతి స్టూడెంట్లు 3,88,926 మంది చదివితే, 2018-–19 నాటికి ఆ సంఖ్య 3,74,161కి తగ్గింది. రెండో తరగతిలో మాత్రం 16 వేల వరకూ అడ్మిషన్స్‌‌ పెరిగాయి.

గురుకులాలు పెరిగినా.. స్టూడెంట్స్ పెరగలే

స్టేట్‌‌లో 29వేల వరకు గవర్నమెంట్‌‌ స్కూళ్లు( లోకల్‌‌ బాడీ, గవర్నమెంట్‌‌, గురుకులాలు) ఉన్నాయి. వీటిలో ఏటా స్టూడెంట్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2017–-18లో 27,58,426(47.26%) మంది చదివితే, 2018-–19లో ఆ సంఖ్య 26,87,433(46.28%)కు చేరింది. గతేడాది కొత్తగా వందల సంఖ్యలో గురుకులాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయినా స్టూడెంట్ల సంఖ్య పెరగలేదు. ప్రైవేటు స్కూళ్లను కంట్రోల్ చేస్తే గానీ సర్కారీ బడులను కాపాడటం కష్టమేనని విద్యావేత్తలు చెప్తున్నారు.

రెండేండ్ల స్టూడెంట్స్ వివరాలు..

       2017-18        2018-19

సర్కారు       27,58,426    26,87,433

ప్రైవేటు        30,77,884    31,19,219

మొత్తం        58,36,310    58,06,652