ఎన్నికల ఖర్చు కోసం లీడర్ల పరేషాన్.. కోట్లు సర్దుబాటు కాక కొత్త తంటాలు

ఎన్నికల ఖర్చు కోసం లీడర్ల పరేషాన్.. కోట్లు సర్దుబాటు కాక కొత్త తంటాలు

కర్ణాటక గెలుపుతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లో కాస్త జోష్ కనిపిస్తోంది. తెలంగాణలో తామే గెలుస్తామనే నమ్మకం లీడర్లలో కనిపిస్తోందట. నమ్మకం సరే ఎన్నికల ఖర్చు తలచుకుని భయపడుతున్నారట. అనుచరులు, క్యాడర్ దగ్గర ధైర్యంగానే ఉంటున్నా..లోలోపల మాత్రం వణికిపోతున్నారట. ఏం చెయ్యాలో తోచక, ఎవ్వరితో చెప్పుకోలేక సతమతమవుతున్నారట. పక్క లీడర్లకు చెప్పలేక, చుట్టాలకు పక్కాలకు చెప్పిన లాభం లేదనే ఆలోచనలో పడ్డారట హస్తం లీడర్లు. 

పదేళ్లుగా ఎన్నికల ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. ఎన్నికల్లో పోటీ చెయ్యాలంటే కోట్లు ఉండాల్సిందే. ప్రత్యర్థిని బట్టి ఈ లెక్క మారుతుంది. ప్రత్యర్థి బలవంతుడైతే..అంతకుమించి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఖర్చు సమస్యే కాంగ్రెస్ లీడర్లను పరేషాన్ చేస్తోందట. కోట్లల్లో డబ్బు సమకూర్చుకోవడం ఎలా అనే ఆలోచనలో ఉన్నారట చాలామంది హస్తం నేతలు. పదేళ్లు కాంగ్రెస్ ప్రతిపక్షంగానే ఉంది. ఈ పదేళ్లలో పార్టీ కార్యక్రమాలకు నేతలు బాగానే ఖర్చు చేశారు. హైకమాండ్ ఆదుకుంటుందన్న ఆశ లేదు. జాతీయస్థాయిలోనూ కాంగ్రెస్ ది సేమ్ సిచ్యువేషన్. కర్ణాటక గెలుపును చూసి..పోటీకి సిద్ధమన్నా.. ఎన్నికల ఖర్చే లీడర్లని కలవరపెడుతోందంట.

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది నేతలు..చాలానే వెనకేసుకున్నట్లు పార్టీ లీడర్లే చెబుతారు. ఆస్తులు కాపాడుకోడానికి కొంతమంది ఇతర పార్టీల్లోకి వెళ్తే..ఇంకొందరు వందల కోట్లు సంపాదించినా పైసా బయటికి తియ్యరు. పార్టీలో కొందరి పరిస్థితి దారుణంగా ఉందన్న చర్చ జరుగుతోంది. భారత్ జోడో యాత్ర సక్సెస్ కోసం కోట్ల రూపాయలను అప్పు చేసిన నేతలు ఉన్నారు. రాహుల్, ప్రియాంక గాంధీ సభలు, రేవంత్ రెడ్డి మీటింగ్ ల కోసం ఖర్చు పెట్టినోళ్లు కూడా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు ఖర్చు చేసి ఇబ్బందులు పడ్డ లీడర్లు కూడా లేకపోలేదు. భారత్ జోడో యాత్ర సమయంలో ఓ లీడర్.. 12 కోట్ల భూమిని స్పాట్ పేమెంట్ కోసం రూ.6 కోట్లకు అమ్మినట్టు.. ఇచ్చినట్లు టాక్. ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో ఖర్చేట్ల అని ఫీలవుతున్నారట.

వచ్చే ఎన్నికల్లో పోటీకి కొంతమంది నేతలు ముందే సర్దుకుంటున్నారట. నిధుల్ని కూడబెట్టే పనిలో ఉన్నారట. ఎన్నికల ఖర్చుకు కొంతమంది నేతలు తమ భూముల్ని అమ్మకానికి పెట్టినట్లు టాక్. ఇప్పటికే కొందరు లీడర్లు ఎన్ఆర్ఐల వద్ద తాకట్టు పెడితే.. మరికొందరు సేల్స్ కి ఉంచినట్లు తెలుస్తోంది. మెదక్, కరీంనగర్ జిల్లాల లీడర్లు తమ భూముల్ని.. అమ్మకానికి పెట్టినా.. కొనడానికి ఎవరు ముందుకురావడం లేదని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. కర్నాటక రిజిల్ట్ కాంగ్రెస్ నేతల్లో ఆశ పుట్టిస్తున్నా...ఎన్నికల ఖర్చు గుర్తుకు వస్తేనే షివరింగ్ అవుతున్నారట కాంగ్రెస్ నేతలు.