రూ.4 లక్షల కోట్లకు రాష్ట్ర అప్పు : 5 నెలల్లో మిత్తీలకే రూ.6,775 కోట్లు..!

రూ.4 లక్షల కోట్లకు రాష్ట్ర అప్పు : 5 నెలల్లో మిత్తీలకే రూ.6,775 కోట్లు..!
  • చేసిన అప్పులకు సగటున నెలకు రూ.1,355 కోట్లు కడుతున్న రాష్ట్ర సర్కార్
  • ఇంకో రూ.20 వేల కోట్లు అప్పు తీసుకోవాలని ప్లాన్
  • రాష్ట్ర అప్పు రూ.4 లక్షల కోట్లకు!


హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారు చేసిన అప్పులకు వడ్డీలకే రూ.వేల కోట్లు చెల్లిస్తోంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఐదు నెలల్లోనే రూ.6,775 కోట్లను మిత్తీల కింద కట్టింది. కంప్రోల్టర్, అడిట్ జనరల్ (కాగ్) తాజాగా రిలీజ్ చేసిన రిపోర్టులో ఈ విషయం వెల్లడించింది. ఏడేళ్లలో చేసుకుంటూ వచ్చిన అప్పులు, వాటికయ్యే వడ్డీని వాయిదాల పద్ధతిలో సర్కారు చెల్లిస్తోంది. ముందు చూపు లేకుండా విచ్చలవిడిగా అప్పులు చేయడం వల్లే ఇప్పుడు ఖాజానాపై భారం పడుతోంది. నెలఖారు వస్తోందంటే ప్రభుత్వం డబ్బులు ఎలా సర్దాలనే దానిపై తర్జనభర్జన పడుతోంది. జీతాలను విడతల వారీగా ఇస్తోంది. ఆసరా పెన్షన్లను నెల మొదటి వారంలో కాకుండా ఎప్పుడో పంపిణీ చేస్తోంది. ఇప్పుడున్నవి కాకుండా మరో రూ.20 వేల కోట్ల అప్పులు వివిధ కార్పొరేషన్ల కింద తీసుకునేందుకు ప్రభుత్వం ప్లాన్​ చేస్తోంది. దీంతో రాష్ట్ర అప్పు రూ.4 లక్షల కోట్లు దాటే పరిస్థితి కనిపిస్తోంది.
ఏడాదిలో రూ.17,584 కోట్లు
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌‌‌‌లో వడ్డీల కోసమే ప్రభుత్వం రూ.1,545 కోట్లు చెల్లించింది. ఇలా ప్రతినెల సగటున రూ.1,355 కోట్లు కట్టింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ముగిసే సరికి మొత్తంగా రూ.17,584 కోట్లను మిత్తీలకే చెల్లించనుంది. ఇక అప్పుల చెల్లింపునకు ప్రతి నెల వేల కోట్లలోనే కడుతోంది. అప్పుల ఇన్​స్టాల్​మెంట్ రూ.3 వేల కోట్లపైనే ఉంటోంది. లాక్​డౌన్ తర్వాత మూడు నెలల నుంచి రాష్ట్ర సర్కార్ ఆదాయం కొంత మెరుగ్గానే ఉన్నా.. వచ్చినదంతా కిస్తీలు, వడ్డీలకే చెల్లిస్తోంది.
మరిన్ని అప్పులు
మరో రూ.20 వేల కోట్ల అప్పులు కార్పొరేషన్ల కింద తీసుకునేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. వీటిని రెగ్యులర్ అప్పుల్లో చూపదు. ఈ ఫైనాన్షియల్ ఇయర్​లో ఆగస్టు నాటికి ఎఫ్ఆర్‌‌‌‌‌‌‌‌బీఎం పరిధిలో చూపెట్టే అప్పుల్లోనే రూ.21 వేల కోట్లు తీసుకుంది. వాటితో సంబంధం లేకుండా రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు, కొత్తగా నిర్మించబోయే మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లకు, రెండో విడత గొర్రెల స్కీం వంటి వాటికోసం మరోసారి రూ.20 వేల కోట్లు తీసుకుంటోంది. ఇప్పటికే కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల కోసం వేల కోట్ల అప్పులు తీసుకున్న సర్కార్.. వాటికోసమే మళ్లీ మళ్లీ అప్పులు చేస్తోంది. దీంతో భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆర్థిక శాఖ అధికారులు, ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రూ.43,864 కోట్ల రాబడి
కాగ్ రిపోర్ట్ ప్రకారం ఐదు నెలల్లో రాష్ట్రానికి రూ.43,864 కోట్ల రాబడి సమకూరింది. ఇందులో టాక్స్ కింద వచ్చిన మొత్తం రూ.37,591 కోట్లుగా ఉంది. ఇందులో జీఎస్టీ వసూళ్లు రూ.12,461 కోట్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్ల ఫీజు కింద రూ.3,787 కోట్లు, సేల్స్ టాక్స్ రూ.10,590 కోట్లు, ఎక్సైజ్ వసూళ్లు రూ.6,048 కోట్లు, కేంద్రం నుంచి వచ్చిన రాష్ట్ర పన్నుల వాటా రూ.2,854 కోట్లు,  ఇతర పన్నులతో రూ.1,848 కోట్లు వచ్చాయి. ఇక నాన్ టాక్స్ రెవెన్యూ కింద రూ.2,089 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కంట్రిబ్యూషన్ కింద రూ.4,183 కోట్లు వచ్చాయి.