
- మునుగోడు అనుభవాలతో భయపడ్తున్న ఆఫీసర్లు
- నేతలకు అనుకూలంగా పనిచేస్తే ఈసీ చర్యలు
- చేయకుంటే రూలింగ్ పార్టీ నుంచి తిప్పలు
- ఇప్పటికే పలు చోట్ల మొదలైన ట్రాన్స్ఫర్లు
- రాజకీయ బదిలీలు వద్దని వేడుకుంటున్న ఉద్యోగులు
నల్గొండ, వెలుగు: రాష్ట్రంలో ఎన్నికల బదిలీల హడావిడి మొదలైంది. కీలకమైన పోలీస్, రెవెన్యూ శాఖల్లో ఇప్పటికే ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి. చాలాచోట్ల తమకు అనుకూలమైన పోలీస్, రెవెన్యూ ఆఫీసర్లను నియమించుకునేందుకు ఎమ్మెల్యేలు పై ఆఫీసర్ల వద్ద పైరవీలు చేసుకుంటున్నారు. హైకమాండ్ కూడా ఆగస్టులోగా అనుకూలమైన ఆఫీసర్లను తెచ్చుకోవాలని టార్గెట్ పెట్టినట్లు పలువురు ఎమ్మెల్యేలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు.
కాగా, ఈ తరహా పొలిటికల్ బదిలీలకు ఛాన్స్ ఇవ్వవద్దని, ర్యాండమ్‌గానే తమను ట్రాన్స్ ఫర్ చేయాలని పలువురు ఆఫీసర్లు, ఉద్యోగులు పై ఆఫీసర్లను రిక్వెస్ట్ చేస్తున్నారు. రూలింగ్ పార్టీ లీడర్లు, ఎమ్మెల్యేల సిఫార్సు మేరకు బదిలీలు చేస్తే ఎన్నికల్లో వాళ్లకు అనుకూలంగా పనిచేయాల్సి వస్తుందని, చేస్తే ఈసీ నుంచి, చేయకుంటే లోకల్ లీడర్ల నుంచి తలనొప్పులు తప్పవని వాపోతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల టైంలో రూలింగ్పార్టీకి అనుకూలంగా పనిచేసిన పలువురు ఆఫీసర్లు అభాసుపాలవడం, వాళ్ల పై ఎన్నికల సంఘం క్రమశిక్షణ చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
మొదలైన బదిలీలు..
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2024 జనవరి నాటికి ఒకేచోట మూడేండ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు ట్రాన్స్ఫర్తప్పనిసరి. ఎన్నికల విధుల్లో కీలకంగా వ్యవహరించే పోలీస్ శాఖలో ఎస్ఐ, రెవెన్యూశాఖలో తహసీల్దార్, పంచాయతీరాజ్‌లో ఎంపీడీవో ఆపై స్థాయి అధికారులందరినీ ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఈమేరకు ఇప్పటికే శాఖలవారీగా లిస్టులు రెడీ చేసిన ఉన్నతాధికారులు ఈసీకి అందజేశారు.
వాటి ప్రకారం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీస్ఆఫీసర్లలో 90 శాతం మందికి పైగా ట్రాన్స్ఫర్ కానున్నారు. మూడేండ్లుగా ఒకేచోట పనిచేస్తున్న ఆఫీసర్లకు బదిలీలు తప్పని సరి అని ఎన్నికల రూల్స్ చెప్తున్నా వారిని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలనేది ఆయా శాఖల ఉన్నతాధికారుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. దీంతో తమకు అనుకూలమైన వాళ్లను నియోజకవర్గాలకు రప్పించుకునేందుకు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు, ఆశావహులు పై ఆఫీసర్ల దగ్గర పైరవీలు చేసుకుంటున్నారు. నిజానికి నచ్చిన ఆఫీసర్లను తెచ్చుకునేందుకు పార్టీ హైకమాండ్ ఎమ్మెల్యేలకు ఆగస్టు వరకు డెడ్‌లైన్ పెట్టినట్లు తెలిసింది. అక్టోబర్ నెలాఖరు కల్లా జిల్లా ఆఫీసర్లంతా ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్లనుండడంతో ముందే జాగ్రత్త పడ్తున్నట్లు తెలిసింది.
నిబంధనలకు విరుద్ధంగా..
ఎమ్మెల్యేలు చేస్తున్న పైరవీలకు తలొగ్గుతున్న ఆఫీసర్లు నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం రెండేండ్ల సర్వీసు కూడా పూర్తికాని పోలీస్ ఆఫీసర్లను కూడా ట్రాన్స్ఫర్లు చేస్తుండడం చర్చనీయాంశమవుతోంది. ఉదాహరణకు నాలుగు నెలల కింద సూర్యాపేట జిల్లా నుంచి తిప్పర్తి మండలానికి వచ్చిన ఎస్ఐ రవిని తాజాగా చిట్యాలకు ట్రాన్స్ఫర్ చేశారు. చిట్యాలలో పనిచేస్తున్న ఎస్ఐ ఎన్ ధర్మాను.. తిప్పర్తికి బదిలీ చేశారు. వీరిద్దరిలో ఎవరు కూడా మూడేండ్లు పూర్తి చేసుకోలేదు. ఇక పెన్‌పహాడ్‌లో పనిచేసిన శ్రీకాంత్ గౌడ్‌ను కేతేపల్లి పీఎస్‌కు , అక్కడ పని చేస్తున్న అనిల్ రెడ్డిని సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలానికి ట్రాన్స్ఫర్ చేశారు. వీరి బదిలీల వెనుక రాజకీయ కోణం ఉందని చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న ఓ ఎస్ఐని కట్టంగూరుకు బదిలీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇక కొద్దిరోజుల క్రితం కట్టంగూరు, చిట్యాల మండలాలకు కొత్త తహాసీల్దార్లు వచ్చారు. వీరిద్దరూ ఎమ్మెల్యేకు దగ్గరవాళ్లు కావడంతో పట్టుబట్టి ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్లు తెలిసింది.
పొలిటికల్ బదిలీలు వద్దు..
తమను రూల్స్ ప్రకారమే ట్రాన్స్ ఫర్ చేయాలని, ఎలాంటి పైరవీలకు తలొగ్గి ఎమ్మెల్యేలు చెప్పిన చోటికి బదిలీ చేయవద్దని పలువురు ఆఫీసర్లు, ఉద్యోగులు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. ఎమ్మెల్యేల సిఫార్సు మేరకు బదిలీలు చేస్తే ఎన్నికల్లో వాళ్లకు అనుకూలంగా పనిచేయాల్సి వస్తుందని, చేస్తే ఈసీ నుంచి తిప్పలు తప్పవని వాపోతున్నారు. రాష్ట్రంలో జరిగిన వివిధ ఉప ఎన్నికలతో పాటు మునుగోడు ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలను ఉదహరిస్తున్నారు. మునుగోడు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ జగన్నాథరావు ఈసీ రిలీజ్ చేసిన పార్టీ బ్యాలెట్ గుర్తుల్లోంచి బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసిన రోడ్డురోలర్ గుర్తు తొలగించారు. రూల్స్ ప్రకారం సింబల్స్ మార్చే అధికారం ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్‌కు లేదు. కానీ బీఆర్ఎస్ లీడర్లు చెప్పారని బ్యాలెట్ పేపర్ నుంచి సింబల్ తొలగించడంతో అది కాస్తా ఆర్డీవో మెడకు చుట్టుకుంది. చౌటుప్పుల్ తహసీల్దార్‌గా పని చేసిన పార్థసింహారెడ్డి బ్యాలెట్లలో ఓడకు బదులుగా పడవ గుర్తును ముద్రించారు. దీంతో ఈ ఇద్దరిని ఎన్నికల సంఘం విధుల నుంచి సస్పెండ్ చేసింది. ముఖ్యంగా సస్పెన్షన్‌కు గురైన జగన్నాథ్‌రావు భవితవ్యం ఏమిటన్నది ఇప్పటి వరకు తేలలేదు. ఇలాంటి ఘటనలతో ఆందోళన చెందుతున్న ఆఫీసర్లు పొలిటికల్బదిలీలకు తమను దూరంగా ఉంచాలని ఉన్నతాధికారులను రెక్వెస్ట్ చేస్తున్నారనే టాక్ నడుస్తోంది.